పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

57

నొకనాడు గుణవర్మయు ధనవర్మయు సభాభాగమందున్నతఱి వారియొద్దకు బోయి తననిద్యాపాటన మంతయు జూపి వారి మైత్రి సంపాదించుకొనియెను.

అది మొదలు ప్రతిదినము అతండు వారియొద్దకుబోయి వినోదము గలుగ జేయుచు ననతికాలములోనే వారిని దానుజెప్పినట్లు వినువారిగా జేసికొనియెను.

వారిరువురు తమరహస్యములన్నియు జయభద్రునితో జెప్పుచుండిరి.

ఒకనాడు మంధాంథుండైన ధనవర్మ అతనితో రహస్యముగా నిట్లనియె. మిత్రమా! నీకంటెనాకు నాప్తు డెవ్వడును లేడు. నీతో జెప్పని రహస్యము లుండవు. హైమవతి మిగుల రూపవతి అని విని నేను అవమానము లెక్కకొనక కులపరిపాటి పాటింపక చంద్రపాలుని భార్య రహస్యముగా రమ్మని పత్రిక వ్రాయగా వచ్చితిని. ఆచిన్నదియు దక్కినదికాదు గుణవర్మయు నావలెనే యవమానముబొందెను. దాని తలిదండ్రు లాచిన్నదాని నెచ్చటినో దాచియుందురు. ఎన్నిగతుల నిర్బంధించి అడిగినను నిజము జెప్పకున్నారు. తుదకు మేమిరువురము గలసి వారని జెఱశాలం బెట్టించితిమి. అప్పుడును నిజము జెప్పిరికారు. ఇకనేమి చేయవలయును. ఆచిన్నదానిమేని అలంకారము లెచ్చటనో దొరికినవని కొందఱం దీసికొనివచ్చి బద్దులం జేసిరి కాని తన్మూలమునను దేటబడలేదు. నీవుమిగుల బుద్ధిమంతుడవు. హైమవతిజాడ నెటులయినను గనుగొని మంత్రపాలుని జంపింపవలయు. అతండు నాకాయుపతి నిచ్చుటకు మొదటనే యొప్పుకొనలేదు. నేనిట్టిపని నిదివరకే చేసెదనని ప్రయత్నించితికాని, గుణవర్మ యొప్పుకొనకున్నవాడు. ఈవిషయమై నీవు నాకు సహాయము చేయవలయును. అప్పటినుండియు నా కారాజునందు నీర్ష్యగలిగియున్నది. నాకు హైమవతి లభింపకున్నను, మంత్రపాలునియందుగల కసితీఱినం జాలునని యుగ్రముఖముతో బలికినవిని జయభద్రుడు అతనియుద్యమమునకు వెరగుపడుచు నిట్లనియె.

మిత్రమా! నీవు తొందరపడవలదు. నేనానిజము తెలిసికొని నీకు జెప్పెదను నాకిదివఱకే కొంచెము దెలిసియున్నది? అదినిస్సంశయముగా దెలిసినపిమ్మటగాని నీతో జెప్పదలచుకొసలేదు. ఈవిషయమై మంత్రపాలు డేమియు నెఱుంగడు. రేపంతయు జెప్పెద దాళియుండుమని పలుకగా నిలువక ధనవర్మ అదేమియో అప్పుడే చెప్పమని యెంతో నిర్భంధించెను. కాని, జయభద్రుడు సెప్పక కాలవ్యవధి కోరెను.

ధనవర్మయు నాగడువు నెట్టకేరకు దాటించి అమ్మఱునాడు జయభద్రుని యొద్దకువచ్చి యారహస్య మెద్దియో చెప్పుమని అడిగెను.

అప్పుడు జయభద్రుడు లోపల దాను జేయబూనిన కపటోపాయమునకు దైవ మనుకూలించెనని సంతసించుచు నలుదిక్కులు జూచుచు నతని కిట్లనియె.

ధనవర్మా! నీతో నేనేమని చెప్పుదును. లోకములో గొందరు మిత్రులవలె నటించుచు దాము జేయదలచుకొన్న పగదీర్చుకొందురు. దానంచేసి యెవ్వరిని నమ్మగూడదు. హైమవతి యెచ్చటికిని బోలేదు. ఈగ్రామమందే యున్నది. ఇక దాచనేల.