పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీకథలు - మూడవభాగము

పురుషులు గుర్రముల నెక్కి యాదారిం బోవుచు నేనున్నచోట నిలిచి అందున్న గృహస్థుల పెట్టెలు కొన్ని చిక్కములో నిమిడ్చి తమ గుఱ్ఱములపై వైచుకొనిరి. వారిలో నొకఁడు నేనున్న గంపనెత్తిచూచి బరువుగానున్నదిరా అని పలుకుచు నొక చిక్కములో నిమిడ్చి తన గుర్రముపై వైచుకొని యా గుర్రమెక్కి వడిగా దోలుకొని పోవుచుండెను. మఱియునొకమూల నగ్నిజ్వాలలెక్కువయయ్యెఁ గావున జను లందఱు నాసందడిలో నుండుటచే దొంగల విమర్శింపఁ దటస్థించినది కాదు.

అట్లు వాండ్రందఱును గుర్రములను వడివడిగాఁ దోలుచు నొక అరణ్య మార్గంబునం బడి పోవుచు నొండొరు లిట్లుసంభాషింపుకొనిరి.

ప్రధముఁడు -- ఓరీ! మనము వచ్చినవేళ మంచిది సుమీ ? యిండ్లంటుకొనక పోయినచోఁ బెండ్లివారింత అశ్రద్ధగానుండరు అప్పుడు వారిమందరము లింతసులభముగా దొరకవు.

ద్వితీయుఁడు -- అగును. ఇండ్లంటుకొనినది పెండ్లివారిమూలముననే. ఏవిచ్చుబుడ్డిరవ్వో తగిలి అగ్ని ప్రజ్వరిల్లినది. ఎట్లైనను పెండ్లి సమయములలో దొందరగా నుందురులే.

తృతీయ - మనవేషములు చూచి మనలను దొంగలని యెవ్వరును గురుతు పట్టలేరు. పెండ్లివారే యనుకొందురు. రాణిగారి సత్రములో నెవ్వరో పెండ్లివారున్నారు చూచితిరా.

ద్వితీయ - చూడకేమి, నా గుర్రముపైనున్న మందసములు అచ్చటివే అగుంగాని వారి జాడ భాగ్యవంతులువలె దోచుచున్నది. మేళతాళములు లేమియును లేవేమి?

తృతీయ - అందఱును వృధాగా రొక్కము వ్యయపెట్టుదురా? ఆ పెండ్లికొడు కేమియుఁ జక్కగాలేడు సుమీ.

ద్వితీయ — రాజుగారు కూఁతురునిచ్చే పెండ్లికుమారుఁడు మంచి చక్కనివాడు కాని వస్తువాహనము లంతగానున్నట్లు తోఁచదు.

తృతీయ - సత్రములోనున్న పెండ్లివారెవ్వరింటికి వచ్చిరి?

ద్వితీయ - ఏమో. అది యెవ్వరికి గావలయును మనము బంధువులవలెఁ బోయి కొంపముంచితిమి గదా?

తృతీ - ఆ మాత్రము తెలిసికొనలేక పోయిరేమి?

ద్వి - క్రొత్తవాండ్ర కేమి తెలియును. మేము రాజభటులమని చెప్పినతోడనే కాబోలు ననుకొన్నారు.

తృ - మనల వెనుక తరుముకొని రారుగదా?

ప్రధమ - అబ్బో! మనమిప్పు డెంతదూరము వచ్చితిమనుకొంటివి? పది యోజనములు వచ్చితిమి అదియునుంగాక నీ అడవిలోదారి తెలిసికొనగలరా? మన కలవాటుగనుక సులభముగా వచ్చితిమి.