పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/248

ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

251

ఆమాటలు విని విక్రమార్కుడు తదీయశ్లోషోక్తులను సంతసించుచు వెండియు నెద్దియో యడుగబోవు సమయములో నేను లేచి దేవా! నేనీ పూవుబోడిని ముందు మాటాడించితిని నాయభీష్టము తీరుపరా? వేగము పోవలసిన పనియున్నది. అని యడిగిన నన్నరపతి మంచిది నీ కోరిక యెద్దియో చెప్పుము. తీర్చియే తరువాత పని గావించుకొనియెదమని పలికెను.

అప్పుడు నేను దేవా! ఈ కాంతను మఱియేమియు నడుగక విడిచిపెట్టుటయే నాయభీష్టము, అట్టివరమిచ్చి మీమాట నిలుపుకొనుడనియు నారాజు సంతసించుచుఁ గానిమ్ము నీ యిష్టము చొప్పున నిప్పడంతిని విడిపించెదము కాని మేము నీవెవ్వతెవని యడిగినప్పుడు మిన్నుదెసకు వ్రేలుచూపి చేయిం ద్రిప్పునది. దానియర్థమేమియో మాకు విడిపోయినదికాదు. ఆపరిభాషకర్దము దెలిసికొని వదలింతుము. తెలిపింపుమని నొడివిన నేనయ్యర్ద మారుచిర వలన దెలిసికొని యిట్లంటిని.

దేవా! మఱియేమియులేదు. ఇప్పుడు నేను మీచేతిలోఁ జిక్కితిని. నన్ను రక్షించువాడు భగవంతు డొక్కడుతక్క మఱియెవ్వరును లేరు. అతడే నన్ను విడిపించుగాక యని వ్రేలాకసమువంక చూపినదట. ఇదియే దీని పరిభాషయని చెప్పిన మెచ్చుకొనుచు నాభూపాలుం డయ్యంగనకు నూత్నాంబరాభరణాదు లొసంగియంపిన నేనయ్యంగనను సత్రములోనికిఁ దీసుకొనివచ్చి రామున కప్పగించితిని. వారిరువురు పరస్పరవియోగదుఃఖములఁ దెలుపుకొనుచు నాదివసము గడిపిరి.

నేను మఱునాడు రాముని నేకాంతముగాఁ జీరి అన్నా! సహవాసదోషంబున నెట్టివారికి దుర్గుణములు సంక్రమింపకమానవు. చోరపరిచయంబునంగదా నీకీ చోర బుద్ధి పుట్టినది. మనము గొప్పవంశంబునఁ జనియించితిమి. నీచకృత్యములకు పూనుకొనరాదు ఈ రుచిర చతురమతియైనను నీచజాతిని జనించినదగుట దమకార్యంబుల త్రోవబోవుచుండును అదియునుంగాక యుత్తమజాతియువతివలన గలిగిన సంతాన ముత్తమముగానుండును. ఈ రుచిరను పుట్టినింట విడిచిరమ్ము. నీకు దేవకాంతం బెండ్లిచేసెదను. మల్లికయను యక్షకాంత యొక్కతె రూపంబున నసామాన్యమై యున్నది. ఆ యువతి నేచెప్పినట్లు వినునదని, నేను శ్రీశైలమున కరిగినది మొదలు వానిం చూచువరకు జరిగిన కథయంతయు చెప్పితిని.

నావృత్తాంతము విని సంతసించుచున్న ట్లభినయించుచు రాముడు తమ్ముడా? ఏది నీవీణామాహాత్మ్యము చూతము. ఈరాత్రి చారుమతి నిచ్చటికి రప్పింపుమని అడిగిన వాని యభిలాష నిజమనుకొని యారాత్రి ఏకాంతప్రదేశమున కూర్చుండి యావీణపై నారాగము పాడినఁ జారుమతి యచ్చోటికి వచ్చినది.

అప్పుడు రామునికి సన్నచేసిన నతడు మేమున్నగదిలోనికి తలుపు దెరచికొని వచ్చిన చూచి యాచిగురుబోడి విసిగికొనుచు నంతర్ధానమైపోయినది. నేనొక్కరుండగాక యితరులుండ తన్నుఁ జీరఁగూడదని యామె నొడివినమాట నాకప్పుడు జ్ఞాపకమువచ్చి పశ్చాతాపము జెందుచు వానితో నామాట చెప్పితిని.