పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/223

ఈ పుట ఆమోదించబడ్డది

226

కాశీమజిలీకథలు - మూడవభాగము

చాతుర్యమునకు మెప్పువచ్చె. మిమ్ము బ్రధానమంత్రినిగా జేసికొనుటకు దాత్పర్యముగా నున్నది. నీబుద్ధిబలంబున సురరాజ్యమునయినను సంపాదింపవచ్చును. నీ యందు రాజ్యభారమిడి కొన్నిదినంబులు హాయిగా సుఖించెద. నీయభీష్టమేమని యడిగిన నతండభినందించుచు దన వృత్తాంతమంతయు నారాజున కెఱింగించెను.

అతనిచరిత్రము విని యమ్మహీకళత్రుండు మిగుల సంతసించుచు నప్పుడే యతనికి బ్రధానమంత్రిత్వాధికారమిచ్చి తనముద్రికల నతనియధీనము గావించెను. అదిమొదలు విజయుండు రాజాస్థానమునకు బోవుచు రాజ్యాంగముల జక్కగా భద్రపరచి ప్రజలు మిక్కిలి సంతసించునట్లు తానే రాజ్యము గావించుచుండెను.

ఒకనాడా రాజకుమారుండు తనపేరిట గట్టబడిన సత్రములో బ్రాహ్మణు లెందఱు భుజించుచుండిరోయని భోజనసమయంబున నాసత్రమునకుబోయియి సంతృప్తిగా భుజియించు బ్రాహ్మణులపంక్తుల నడుమదిరుగుచు వారివారి యభీష్టము లడుగుచుండ నందులోఁ దన తమ్ముడైన భానుడు భుజియించుచుండఁ గాంచి గుఱుతుపట్టి యతని వికృతవేషమునకుం గుందుచు భోజనానంతరమున తనయింటికిం దీసికొనిపోయి యేకాంతముగా నిట్లనియె -

తమ్ముడా? నీవిట్లుంటివేమి? సొమ్మంతయు నేమయినది? ఏకాంతనైన బెండ్లి చేసికొనలేదా. పేదబ్రాహ్మణునివలె సత్రంబుల వెంబడి గ్రుమ్మరుచు క్షత్రియధర్మము నీట గలిపితివేమి? ఈదైన్యమేల? ఇంటికి బోయితివికావేమి? నేను నీ యన్నను, విజయుడనని తన వృత్తాంతమంతయు జెప్పెను.

అప్పుడు భానుడు తెల్లబోయి కన్నీరు విడుచుచు అన్నా! నాదైన్యస్థితినేమని చెప్పుదును? నేనట్లు పట్టణంబువదలి క్రమంబున ననేక జనపదంబులం గడిచి యొకనాటి సాయంకాలమునకు గుంభకోణమునకుం బోయితిని అందొక సత్రంబునం బసచేసియున్న సమయంబున గొందరు ధూర్తులు నాయొద్దకువచ్చి నన్నాపాదమస్తకము శోధించి వినయంబుతో మీవృత్తాంతమేమని యడిగిరి.

నేను వారితోఁ గన్యార్థినయి వచ్చితిని ఉత్తమకన్యక లీపట్టణమున నెందేని గలరా? వలసినంత ద్రవ్యమిచ్చెదనని చెప్పితిని. అప్పుడు వాండ్రు నాయొద్ధ ధనమున్నట్లు గ్రహించి మంచిది నీయభీష్టము వచ్చిన కన్యకం దెచ్చెదము కొన్ని దినంబులిందు వేచియుండుమని చెప్పి యది మొదలు నాకెన్నియేని యుపచారములు సేయదొడంగిరి. దానికి నేను మిక్కిలి యానందించుచు వారినెల్ల పరమాప్తులుగా నెంచి మన్నించుచుంటిని.

మఱి నాలుగుదినంబులు గడిచినవెనుక నొకనాడొక చక్కని యువతిని నా యొద్దకు దీసికొనివచ్చి యీపోలిక మచ్చకంటి నీకు గావలయునా? అని యడిగిరి. అమ్ముదితయు నాయెదుట నెన్నేని శృంగారచేష్టల వ్యక్తపరచినది. దానిచూపుల చేతనే నాచేతనము పరాయత్తమైనది. ఆ కాంత నాచెంత నున్నంతసేపు నాకేమియు మాటవచ్చినది కాదు. వాండ్రు కొంతసేపు నాచెంత నాయింతినునిచి యంతలో దీసి