పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రముఖుల అభిప్రాయాలు

నా సహాధ్యాయి మధిర సుబ్బన్న దీక్షితకవి సర్వవిధముల ధన్యుఁడని వ్రాయుటకు మిగుల సంతసించుచున్నాను అతఁడు నాతో మును మున్ను కొన్ని గ్రంథములు గౌతమీ మాహాత్మ్యము లోనగునవి, వ్రాసియుండియు నిపుడు కాలానుసారముగాఁ గథలు వ్రాయుటకుఁ బ్రారంభించినాఁడు. చిన్నతనములో నుబుసుపోకకుఁ జెప్పుకొను కథలను బుచ్చుకొని “కాశీమజిలీలు” అను పేరుతోఁ జమత్కరించి కథాసంవిధానముం జతపఱచి మొదటి భాగమచ్చొతించి ప్రకటించినాడు. అది ప్రజల మదుల నాకర్షించినది. ద్వితీయ, తృతీయాది భాగములు వ్రాయుటకు బ్రోత్సాహము గలిగించినది. ఇప్పటికి పన్నెండు భాగములైనవి. నేనీ కథలను పూర్ణముగఁ జదువ లేదు గాని యే భాగములోనో యొకటి రెండు కథలు మాత్రము చదివితిని. అది చదివినప్పుడు నాలో నాకే పరమాశ్చర్యము గలిగినది. నా సహాధ్యాయి విషయము నేను జెప్పుట కొంతవరకు దగదేమోకాని పింగళ సూరనార్యుని కళాపూర్ణోదయ కథకుం బోలె మనోహరత్వముం గలిగించినది. ఇట్లు నాబోట్లు వ్రాయుటకుం బూని కృతకృత్యులు గాలేరనియే నా నిశ్చయాభిప్రాయము. ఒక్కొక్క పురుషుని కొక్కొక్క దానిలోఁ బ్రావీణ్యము గలుగుననుట నిశ్చయము వాని కథ లుపకథలతోఁగూడి యొక పెద్దగొలుసువలె మనోహరములై యుండును. ఆ కథలలో ననేక నీతులు, ధర్మములు, ఆచారములు, శృంగారాదిరసములు, ఆధ్యాత్మాప్రబోధక ప్రదర్శనములెన్నో యుండును. ఇవి సర్వజనాదర పాత్రములగుటయే నా చెప్పిన మాటలు సత్యములనుటకుఁ దార్కాణమగుచున్నవి. గద్యశైలియు సుబోధమై పండితపామర హృద్యంబగుచున్నయది. ఈ కథలు బృహత్కథాదులవలె జగద్విఖ్యాతి గాంచుగాకయని కోరుచున్నాను.

ఇట్లు,

శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి

కొలఁది దినములనాఁడు దయాపూర్వకముగ నొసంగిన కాశీమజిలీలు అను పేరుగల భవద్విరచత గ్రంథము నాకొసఁగుచు వీనిని జదివి యభిప్రాయమును దెలుపవలసినదియని సెలవిచ్చియున్నారు. తదేకదష్టితో దమగ్రంథము నందలి కొన్ని కథలను జదివితిని. అది కేవలము కథలవంటివేకాక వ్యాకరణాదిశాస్త్ర సాంప్రదాయము నందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీనకావ్యముల కించుకయుఁ దీసిపోక పాఠకులకు మంచి సాహిత్యజ్ఞాన మలవఱుచుటకుఁగడుంగడుఁ దగియున్నట్లు గ్రహింపఁగల్గితిని.

ఇట్లు,

శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి