పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

190

కాశీమజిలీకథలు - మూడవభాగము

నిదానంచూచి అయ్యో! మన నాగమణికాదా? ఎట్లు వచ్చితివే! బ్రతికియుంటివా? నా ముద్దులపట్టి నేమిచేసితివని పలుకుచు లేచి దానిం గౌగలించుకొనినది అదియు నందరము సురక్షితముగా నుంటిమి నీవు విచారింపకుము నీకూతురు సజీవయై యున్నట్లు దైవకృపవలన మీ యొద్దకు రాగలదని పలికిన విని యమృతవర్షము గురిసినట్లు సంతసించుచు యేమీ? నా బిడ్డబ్రతికి యున్నదా? యథార్థమే! పసిపాప యిప్పటికి పెద్దదికావలయునే నన్ను గురుతుపట్టునేమో? ఎక్కడ నున్నది? ఏమిటికి దీసికొని వచ్చితివికావు . మా యొద్దకు రానన్నదియా యేమి దయలేనివారమని నిందించుచున్నది కాబోలు? నీ వృత్తాంతమంతయు సవిస్తరముగా జెప్పుము. ఇన్నినా ళ్ళెందుంటివి. ఏమేమి పనులంగావించితివి? ఏయేదేశములు దిరిగితివని యడిగిన నన్నాగమణి యిట్లనియె.

నాగమణి కథ

అమ్మా! నా వృత్తాంతము భారతమంతయున్నది. సంక్షిప్తముగా జెప్పెద వినుము. మీరట్లు చూచుచుండగ శిశువును బట్టుకొనుటకయి నీటంబడితినిగదా! పడిన తోడనే యాబిడ్డ నాచేతికి జిక్కినది అంతలో నొక సుడివచ్చి మమ్ము నిరువురని ముంచి దూరముగా దేలవైచినది. అప్పుడొక దారువు దైవవశమున నాజేతికి దొరికినది. అది యూతగాగొని యొకచేతబిడ్డను మునుంగకుండ నెత్తిపట్టుకొని నీటిపయి దేలియుంటిమి. నీటివేగమున దృటిలో మఱియొకపట్టణప్రాంతమునకు బోయితిని.

అచ్చట నీటితట్టులకయి యాడుచున్న యొక పల్లెవాడు మమ్ము సమీపించెను. వానింజూచి నేను రక్షింపుము రక్షింపుమని యరచితిని వాడు వడిగా మా యొద్దకు నీదుకొనివచ్చి నాచేతిపయినున్న బిడ్డను మెల్లగా దన తెప్పవలు నెక్కించుకొని యొకచేతితో బట్టుకొని నన్నుగూడ బ్రక్కకు జేర్చుకొనవలయునని ప్రయత్నించు నంతలో నూతివంటి సుడి వచ్చి మా యిద్దరను దూరముగా త్రోసివేసినది. పాపము వాడు నాయొద్దకు నీదుకొనిరావలయునని యెంతయో ప్రయత్నము చేసెను కాని శిశువు తెప్పమీదనుండుటచే గాపాడుచు నీదుట దుర్ఘటమైనది.

పిమ్మట నన్ను వదలి వాడు వేగముగా నీదుకొనిపోయి నేను జూచుచుండగనే తీరముజేరెను. అదిచూచినేను మిగుల సంతసించుచు నా బాలికను రక్షించినందులకు భగవంతున కనేకవందనంబుల గావించితిని తరువాత నేనాకర్ర నూతగాబూని ప్రవాహవేగమున గొట్టుకొని పోవుచుంటిని. సాయంకాలముదనుక బోయితిని.ఎవ్వరు గనబడలేదు రాత్రిపడినతోడనే భయము జనించినది. కాని చచ్చుటకు సిద్దముగా నున్న దానగాన దైవమునే ప్రార్థించుచు నా కట్టెను మాత్రము విడువక యరుగు చుంటిని. తెల్లవారువఱకు నట్లెపోయితిని తీరము మెరకలేదు. మరల సాయంకాలము