పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

160

కాశీమజిలీకథలు - మూడవభాగము

గ్రంథము (ధర్మార్థకామవిషయములం దెలుపునది) నూఱువేల అధ్యాయంబులుగా రచించెను. శంకరానుచరుండైన నందికేశ్వరుండు దానిలోనేకదేశంబగు కామతంత్రంబును విమర్శించి సహస్రాధ్యాయములుగా రచించెను. పిమ్మట దానినే క్లుప్తపరచి శ్వేతకేతు డైదువందల అధ్యాయములుగల గ్రంథమును రచించెను. మరియుం దత్తక, కూచిమార, గోణికాపుత్రాదులు పారదారికము కన్యావ్రిసంభము భార్యాదికారము లోనగు నొక్కొక్క విషయమును మాత్రము గైకొని రచించిరి. తరువాత వాత్స్యాయనమహర్షి సర్వవిషయములంగూర్చి సప్తాధికరణములు సూత్రములు వ్రాసెను. అందు నందికేశ్వర శ్వేతకేతు భాభ్రవ్యాదులగ్రంథములు సులభముగా గ్రహింపదగినవికావు. దత్తకాదుల గ్రంథము లేకదేశోక్తములు, వాత్స్యాయనసూత్రములు గూడార్ధములు. కావున సర్వగ్రంధమతసారము గ్రహించి యీకవి ఈ గ్రంథమును రచించెను. అద్దమందు జగంబంతయు ప్రతిఫలించునట్లు యీకృతి యందు నన్నివిషయములు గలిగియున్నవని కవి వ్రాసికొన్నాడు. ఇంతకన్న మంచి గ్రంథము మఱియొకటిలేదని నానమ్మకము.

శిష్యు -- కూర్మము తాదిరుగుచున్న నూతికన్న లోకము లేదనుకొను. గొల్లకలాపమంతయు నేకరుపెట్టియు స్వవచనవ్యాఘాతమును దెలిసికొనలేకుంటివి.

శిష్యురాలు ---- ఎట్లు?

శిష్యు --- బ్రహ్మనిర్మితమైన త్రివర్గసాధనములో మూడవభాగము కామతంత్రము ముప్పదిమూడువేల అధ్యాయములుగలది అది యుండగా పదివేల అధ్యాయములుగల నందికేశ్వర కృత గ్రంథముండగా , వాత్యాయనసూత్రము లుండగా వానినెల్ల విడిచి వానిలో సామాన్యవిషయములందీసి చదువురానివారికి దెలియుటకై పదిపరిచ్ఛేదములుగా రచించిన యొకగ్రంధమునుం జదివి నాపాటి రసికురాలులేదని గర్వపడుచుంటివే! పై గ్రంథములున్నటుల నీవు చదివిన దండకములోనేయున్నయది చూచుకొనుము బ్రహ్మనిర్మితంబయిన త్రివర్గసాధనము నందికేశ్వర వాత్స్యాయనాదిమహర్షి ప్రణీతంబయిన గ్రంథములు మాయొద్దనున్న యవి. మేమవి అన్నియు బాఠముగా జదివికొంటిమి వానికిని నీవు చదివిన గ్రంథములకును హస్తిమశకాంతరము గలిగియున్నయది. కావలసినంజూసుకొనవచ్చును. (అని కొన్ని పుస్తకములు జూపుచున్నాడు.)

శిష్యురాలు -- (విప్పిచూచి) అయ్యో! వీనియందున్నలిపి యేమిలిపి?

శిష్యు - బ్రహ్మలిపి యీలిపియే తెలియక వాదమునకు బూనుకొంటివా? పో పొమ్ము.

శిష్యురాలు - ఇందలి విశేషము లేమి?

శిష్యు --- ఏమియా! చెప్పెదవినుము. నీగ్రంథమందు స్త్రీజాతు లెన్నివిధములు?

శిష్యురాలు — పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని అని నాలుగువిధములు.