పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/148

ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

151

యట. సభాకంపముస్నది కాబోలు, మమ్ములజూచి బెదరజొచ్చెను. రామలింగకవిమాత్ర మీయనకంటె అధికుడా యేమి?

మం -- ఆతం డసాధ్యుడు. నిన్నటి సభలో ఆతం డుండినట్లు తలంచను.

ప్రియం - ఆతం డేయే విద్యలలో బ్రౌఢుండు? మీకును బ్రశంసనీయు డగుచుండెనే.

మందా - ఆ విషయమే స్పష్టముగా దెలియకున్నది. ఆతండన్ని విద్యలలో బ్రసంగించి యోడించుచున్నాడని వార్తాపత్రికలు చెప్పుచున్నవి.

ప్రయం - అట్టివాడు సభలోనుండిన నిన్నటిదిన మూరకుండునా?

మందా - ఆతని వృత్తాంతము రహస్యముగా నరసిరమ్మని హేమలతను నియమించితిని. అది యెక్కడనున్నది?

హేమ - అమ్మా! నేనిదిగో యిచ్చటనే యుంటిని.

మందా - ఇటురా? విశేషములేమి?

హేమ --- అమ్మా! మీయాజ్ఞ చొప్పున నిప్పురమున రామలింగకవి విషయమై చర్చించగా అతడిపుడు గ్రామాంతర మరిగినటుల కొందరు చెప్పిరి. ఆయన పాండిత్యము సైత మనన్యసామాన్యముగా జెప్పుదురు. రేపటిదినమున గాబోవు సభలో అతనినే బ్రతివాదిగా నుంచుదురని వాడుకగా నున్నది.

మందా - నీవు వినినది అసత్యము రేపటిసభలో బ్రతివాదిగా లవిత్రయను కాంత వచ్చి వాదించునటఁ అని యిప్పుడే పత్రిక వచ్చినది. దీని అర్ధము గ్రహించితిరా?

ప్రియం - ఓహో! మందారవల్లి యన తీగెగావున లవిత్రశబ్దము కొడవలి. దానిచే భరిభవింపవచ్చునని వారి అభిప్రాయము. కాని యా తీగ యుక్కుది. కొడవలికి వశమగునదికాదు. దీనిం గోయబూనునేని కొడవలియే మొనపోవును.

మందా - ఏదోయొక కారణమున గాలహరణము జేయవచ్చునుకదా! యెవ్వరైననేమి?

అని ఈరీతి వారు మాట్లడుకొనుసమయంబున నేను ప్రాంతమందుండి వినుచుంటిని. ఇంతలో నొక నెలంత వచ్చి పల్కరించినది. మఱి నిలుచుట కవకాశము చిక్కినదికాదు. అప్పుడు మెల్లగా మందారవల్లి దాపునకుంబోయి దీవించుచు నామగోత్రము లెఱిగించి దేవతాప్రసాద మిచ్చితిని. అదియు భక్తిపూర్వకముగా స్వీకరించి పూవులఁ గన్నుల నద్దికొనుచు గొప్పున నిడికొని నాకు గద్దెవేయించి గూర్చున్న యంత నమస్కరించుచు నావృత్తాంత మడిగిన నేనిట్లంటిని.

గణికామణీ! నేను సావిత్రీ దేవాలయముననున్న అర్చకుని భార్యను. నా పేరు మంజుల. నీవైదుష్యము సౌందర్యము దాతృత్వము నీయూర ఆక్కజముగా జెప్పుకొనుచుండ నిన్ను జూడవచ్చితిని. మా సావిత్రీదేవి ఆశ్రితకల్పలత యని ప్రసిద్ధి చెందియున్నది. జగత్ప్రసిద్దుండైన తెనాలి రామలింగకవియు దత్సేవ వల