ఈ పుట ఆమోదించబడ్డది

మధు- (లుబ్ధావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులుగారిమీద అన్యాయంగా అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. గిరీశంగారు పంతులుమీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలసిన సంగతికాదు గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు చెప్పకతీరదు. మీ గిరీశంగారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు నన్ను వుంచుకున్నారు. మా పంతులుగారు ఆయన దగ్గిరనుంచి నన్ను తీసుకువెళ్లిపోయి వచ్చినారనే దుఃఖంచేత లేనిపోని మాటలు కల్పించి "నక్కాగిక్కా" అని వ్రాశారుగాని, ఆ బొల్లిమాటలు నమ్మకండి.

రామ- "నక్కా గిక్కా" వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజి దావా పడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది.

మధు- బావా, మరొకమాట ఆలోచించండీ. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, గాడిదలూ- (నవ్వును.)

రామ- మనిషివికావా యేమిటి? గాడిదెమాట లేదంటూంటేనే?

మధు- పోనియ్యండి - మీకెందుకు కోపం! గాడిదలు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ మీ యింటిమీదపడి తింటే మా పంతులుగారికి యేంలాభం? చెప్పండీ. ఒకవేళ రాతబుబేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును.

లుబ్ధా- బాగాచెప్పావు-పోలిశెట్టి చేసినపనే!

రామ- చవగ్గా చేస్తాడని ఖర్చువెచ్చం కోవఁటాడిమీద పెట్టావు. అనుభవించు.

మధు- యిప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పదిరూపాయలు ఖర్చుతో యిక్కడ ముడిపెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీ మావఁగారిపేర వుత్తరం వ్రాయండి.

లుబ్ధా- మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. మావఁగారూ, మధురం మా బుద్ధిమంతురాలు.

రామ- అదుగో! "మధురం గిధురం" అని మీరు అనకూడదు. "మధురవాణి" అనాలి.

లుబ్ధా- పొరపాటు-- గాని తీరామోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కర్తెనీ పంపించేస్తే?

మధు- మరేం? మీతీపు దిగదీసిందీ? పెళ్లిచేసుకొండి.

లుబ్ధా- నా ప్రాణంపోతే యీ సంబంధం చేసుకోను. ఆవుత్తరం కొసాకూ చదివితే అభావచేష్టలు మీకే బోధపడతాయి.

మధు- చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు?

రామ- గిరీశం గాడిమీద పరుపునష్టానికి డామేజీదావా తేకమాన్ను-వాడి మొహం లాగేవుంది వుత్తరం. చదివేదేవిఁటి.