ఈ పుట ఆమోదించబడ్డది

తరవాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలిగదా? ఉద్యోగం చేస్తేగాని డబ్బులావుగారాదే?

బుచ్చ -- అవును.

గిరీ-- అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ. చెబుతాను వినండి. సంసారానికి యిల్లన్నది ఒకటుండాలిగదా? యేవఁంటారు?

బుచ్చ -- అవును.

గిరీ-- నాకు మేడలుంటేనేగాని కుదరదు. యిలాంటి చిన్న యిళ్లలో నాకు ఉక్కిరిబిక్కిరిగా వుంటుంది. ఆమేడచుట్టూ తోట వుండాలి. మావిడిచెట్లూ, అరిటిచెట్లూ, జామిచెట్లూ, చెప్పన్న వృక్షాలూ వేస్తాం. మన వెంకటేశం కోతిలాగ పళ్లుతింటూ యెప్పుడూ ఆ చెట్లమీదే వుంటాడు.

వెంక-- ఆచెట్లపళ్లన్నీ నేనే కోస్తాను.

గిరీ-- అంతవాడివికావనా? మనం అలాగ యిల్లూ, వాకిలీ, తోటా, దొడ్డీ, యార్పరుచుకునేటప్పటికి మనకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్లని సంరక్షణచెయ్యాలా? వాళ్లు నేను కుర్చీమీద కూచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకులాగి నాన్నా యిది కావాలి అది కావాలంటారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటినిండా సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకంపెట్టుకుని, మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనంచేస్తూవుంటే ఒక పిల్ల యిటివేపువొచ్చి మెడకాగలించుకునీ, ఒకపిల్ల అటువేపువొచ్చి మెడకాగలించుకునీ "అమ్మా యిది కావాలి, అమ్మా అది కావాలని" అడుగుతారు. వాళ్లకి సరుకూ జప్పరాచేయించాలి, జరీదుస్తులు కుట్టించాలి. గిరీశంగారి పిల్లల్ని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది. మన పిల్లల్ని వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్లకాదుగదా? వాళ్లకి చిన్నబళ్లూ, గిళ్లూకొనాలి. వాళ్లకి చదువూసంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలి. యిదంతా సంసార తాపత్రయంకాదా? యిందులో పడిపోతే మరి లోకోపకారం చెయడానికి అవకాశవుఁంటుందా? చెప్పడం మరిచిపోయినాను, అప్పుడు మన వెంకటేశం మనదగ్గిరే వుండి చదువుకుంటాడు.

బుచ్చ-- అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడిచదువుకోసం దెబ్బలాడ్రు.

గిరీ-- నే వొద్దన్నానా?

వెంక-- నాకో చిన్న గుఱ్ఱబ్బండి కొనాలి.

గిరీ-- వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లలబండీలో నువ్వుకూడా వెళ్లుదువుగాని, వాళ్లు అల్లరి చెయకుండానూ, కిందపడిపోకుండాను చూస్తూవుందువుగాని.

వెంక-- అక్కయ్యని పెళ్లాడేస్తారా యేవిఁటి?