ఈ పుట ఆమోదించబడ్డది

మంచిమాట చంటిపిల్లడు చెప్పినావిని ఆ ప్రకారం చెయ్యండయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్లు శాస్త్రంలో చెప్పినప్రకారం నడుస్తారూ? యంతమాత్రం నడవరు. మనం శాస్త్రమూ, సవబులూ చూపిస్తే యావఁంటారు? యీ గుంటవెధవలు చెప్పడం మనం విండవూనా అని కఱ్ఱుచ్చుకుంటారు. నామాటకేవిఁ చప్పకండి, నాది యినుంలాంటి శరీరం - కొడితే కఱ్ఱ విరిగిపోవాలిగాని చెక్కుచదరదు. నా ప్రియశిష్యుడికైతేనో? మీ అందరివీ మెత్తని మృదువైన శరీరాలు అవుటచాత యెవిఁకలు విరిగిపోతాయి. గనుక యీ మాటలు మన్లో మనం అనుకోవలసినవే గాని మరోళ్లతో ప్రాణంపోయినా అనవలసినవికావు. యావఁంటారు?

బుచ్చ -- అవును.

గిరీ-- అవునంటే చాలదు. యవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనేగాని, నామనసులో మాటలు నాలుగూ యెలా చెప్పడం?

బుచ్చ -- యవరితోనూ చప్పను.

గిరీ -- వొట్టేసుకోవాలి.

బుచ్చ-- యావఁని వొట్టేసుకునేది?

గిరీ-- యావఁనా? మీరు యవరితోటైనా చెబితే నా బుఱ్ఱ పగిలిపోవాలని వొట్టేసుకొండి.

బుచ్చ-- అహఁ! అలా వొట్టేసుకోను! మీ బుఱ్ఱ చల్లగావుండాలి. చెబితే నాబుఱ్ఱ పగిలిపోవాలని వొట్టేసుకున్నాను.

గిరీ-- అందుకు నే వొప్పుతానా యేవిఁటి?నాబుఱ్ఱ పగిలింతరవాత మీబుఱ్ఱ జోలికి యవడైనా రావాలిగాని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువెయ్యనా?

బుచ్చ-- మాఅమ్మని బతికించారు కారా? మీరు అలాంటివారే.

గిరీ-- ఆ మాట మీరే అన్నారుగనక, వినండి--చెప్తాను. నేను పెళ్లాడి పెళ్లాం బిడ్డలూ నాకుంటే, వాళ్లని తల్చుకున్నతరవాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తియ్యడానికి నూతులోకి గెంత గలిదివుందునా? యీ జన్మవంతా లోకోపకారం కింద వినియోగపర్చుకుందావఁని నిశ్చయించుకుని యిదివరదాకా ఏకాకినై వుంటిని, సత్యమే, మీలాంటి నా మేలుకోరినవాళ్లు " పెళ్లిచేసుకో" అంటే ఆ మాట తోసేయడం కష్టమేగాని;గాని ఒక మాటమాత్రం జవాబు న్యాయంగా చప్పండి. ఒక్కళ్లకి ఉపకారం చెయడం గొప్పా? అందరికి ఉపకారం చెయడం గొప్పా?

బుచ్చ-- అందరికీ చెయ్యడవేఁ గొప్పనుకుంటాను.

గిరీ-- సరే! ఆ మాటమీద నిలవండి. పెళ్లాడి, ఆలూబిడ్డలికి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చెయడంకంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగ పర్చడం పుణ్యంకాదా? చచ్చేకాలానికి స్వర్గం యెదురుగుండా వొస్తుందే?