ఈ పుట ఆమోదించబడ్డది

మీ బిగిన్‌ ది కాంపైన్‌ ఎట్‌ వన్స్‌. (తలుపు కన్నములోనుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచం మ్యూజిక్‌ విసురుదాము. (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూనురాగముతో పాడి) బుచ్చమ్మ వదినగారూ తలుపు తీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదినా ... వెల్‌! ... వెంకటేశం యేమిచేస్తున్నాడు?

బుచ్చమ్మ -- పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు.

గిరీశ-- ఈ వూరువస్తే మరిచదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కుదగ్గిరనుంచి కదలితే వొప్పేవాడను కాను... ఒక్కమాటు పి... పిలుస్తారా పాఠంచెపుతాను.

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.)

ఆహా! దీనిఠస్సా గొయ్యా, మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచం ట్రెంబ్లింగ్‌ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరివకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూలేరు. వంటరిగా దొరికిందిగదా, - యీలాంటప్పుడు నామనస్సులో మాట చెప్పేస్తే తీరిపోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. కానీ, పాఠాలలో చిన్నలెక్చరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు.) యేమివాయి మైడియర్‌ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మరి మాసంరోజులువుంటే వచ్చిందికూడా మరచిపోతావు. యేదీ టెక్స్టు బుక్కు పట్టుకురా. (వెంకటేశం పుస్తకము పట్టుకొనివచ్చును) గాడ్స్‌వర్క్‌స్‌ అనేపాఠంతియ్యి. రీడ్‌ ఆన్‌ మై గుడ్‌ బోయ్‌.

వెంకటేశ-- (తడుముకుంటూ) దేర్‌ యిజ్‌ నాట్‌ ఏన్‌ ఆబ్జక్ట్‌ ఇన్‌ క్రియేషన్‌ వుచ్‌ డజ్‌నాట్‌ సెర్వ్‌ సమ్‌ యూస్‌ఫుల్‌ పర్‌పజ్‌.

గిరీశ-- అట్టె! అట్టె! అక్కడ నిలుపు, క్రియేషన్‌ అనగా యేమిటి?

వెంకటేశ-- క్రియేషన్‌ అనగా - అనగా - ఆవులు.

గిరీశ-- నాన్సెన్స్‌, చదవేస్తే ఉన్నమతికూడా పోతున్నది. ఆవులు యెదటవున్నాయనా ఆవులంటున్నావు? మళ్లీ ఆలోచించి చెప్పు.

వెంకటేశ-- యేమాటకి అర్థం అడిగారండి?

గిరీశ -- క్రియేషన్‌.

వెంకటేశ-- అదా! క్రియేషన్‌ అంటే ప్రపంచం. నేను, యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులేకదా తినడవఁని ఆలోచిస్తూన్నాను.

గిరీశ-- వన్‌ థింగ్‌ ఎట్‌ ఏటైమ్‌. యిప్పుడు పాఠంమాట ఆలోచించు. క్రియేషన్‌ అనే వక్కమాటపైనే వక్కఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్ధాకార భూగోళా అని మనుధర్మశాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి?