ఈ పుట ఆమోదించబడ్డది

రామ: నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ణి కాను.

కరట: తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసేవాణ్ణేనండి. నా రుణాలు పదహారు వందలుంటాయండి. ఆ పైని యెవొచ్చినా తాము దాఖలు చేసుకొండి.

రామ: ’ఐతే, గియ్తే‘ బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్దెనిమిది వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి సగం తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరే దేవిఁటి నాకిచ్చేదేవిఁటి? యేవైఁతేనేవిఁ? ఆ వ్యవహారం యలాగా మించి పోయింది. పది రోజులకిందటొస్తే ఫొక్తుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థ మీద మధురవాణి మేజువాణీకి వాణ్ణొప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరివక ఉపాయం చెబుతాను వినండి. మీకు మైనరు కొమాళ్ళున్నారా?

కరట: చిన్నవాడ్కి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.

రామ: అయితే యిహలేందేవిఁటి? ఆ కుర్రవాడు మయినరని వాదిద్దాం.

కరట: సాక్ష్యం యలా వొస్తుందండి?

రామ: ఓ హో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం విన్నారా? ఉర్లాం బసవరాజుగారి సంభావన్ల రేటే సాక్ష్యాలక్కూడా గేజటార్డర్‌ చేశాం. కుండనాలు వేసుకున్న వారికి ఓ రూపాయి జాఫా.

కరట: జాతకం వుంది గదా యేం సాధనం?

రామ: కాకితవైఁతే అగ్గిపుల్లతో ఫైసల్ ! తాటాకైతే నీళ్ళపొయ్యి! కొత్త జాతకం బనాయించడం అయిదు నిమిషాల పని. మా సిద్ధాంతి మట్టుకు నాలుక్కాలాలు చల్లగా వుండాలి. నా దగ్గిర పాత తాటాకులు అలేఖాలు అటకనిండా వున్నాయి. ముప్ఫైయేళ్ళనాటి కాకితాలున్నాయి. రకరకాలు సిరాలున్నాయి. ఒక నూర్రూపాయలు నాకు ఫీజు కింద యిచ్చి ఖర్చులు పెట్టుకొండి. గ్రంథం నడిపిస్తాను.

కరట: దారి ఖర్చుకోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలుచేసాను. మరి బుర్ర గొరిగించుకుందావఁంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికయినా చేతిలో ఓడబ్బు సొమ్ముండాలిగదా? యిదొహర్తె టొంపలా నాతోవుంటే యలాగండి కోర్టంట తిరగడం? తమ లౌక్యానికి అసాధ్యవఁన్నది వుంటుందంటే నే నమ్మ జాలను. యలాగయినా కుదిర్న సంబంధం తిప్పించి, మా సంబంధం కుదిర్చి నాకు యిచ్చే సొమ్ములో పదోవంతు తాము అంగీకరించి మిగిలింది