ఈ పుట ఆమోదించబడ్డది

నని ప్రోమిస్‌కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీచూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి నాలిక్కొన కొచ్చిన మాట మళ్లీమణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్‌షన్‌ రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్‌ దాంతో నీతండ్రి కళ్లెఱ్ఱజేశి "యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడిపోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి సరేగదా?" అని గట్టిగాకేకవేసి చెప్పేసరికి నేను కొంచంపస్తాయించి "థ్రోయింగ్‌ పెర్‌ల్సు బిఫోర్‌ స్వైన్‌" అనుకొని కరటక శాస్తుల్లువేపు చూసేసరికి యెంచేస్తూన్నాడనుకున్నావ్‌? రాస్కెల్‌ వులకలేదు పలకలేదు సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వుతున్నాడు. యికలెక్చరు వెళ్లిందికాదు సరేకదా, నోట్లోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింతయిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావఁనుకున్నాను.

వెంక-- అయ్యో వెళ్లిపోతారా యేవిఁటి?

గిరీశం-- నాటింది లీష్టు. కొసాకీవిను, నీతండ్రిని పోకెట్లో వేశాను.

వెంక-- నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్లి తప్పిస్తావఁన్నారే?

గిరీశం-- పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమాస్థనీసు, సురేంద్రనాద్‌ బానర్జి వచ్చి చెప్పినా నీతండ్రి యీ పెళ్లిమానడు. లెక్చర్లు యంతసేపూ సిటీల్లోనేగాని పల్లిటూళ్లలో యంతమాత్రం పనికిరావు. పూనాలాంటిసిటీలో లెక్చర్‌ యిచ్చావఁంటే టెంథౌజండు పీపిల్‌ విండానికి వొస్తారు. మన టౌన్లోనో, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బౙార్లుకాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, యాభైమందికారు. పల్లెటూరి పీపిల్‌ లెక్చర్లకి అన్‌ఫిట్‌. మొన్న మనం వొచ్చిన బండీవాడికి నాషనల్‌ కాంగ్రెస్‌ విషయవైఁ రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆగాడిద కొడుకు, వాళ్లవూరు హెడ్‌కానిష్ఠేబిల్ని కాంగ్రెసువారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు! విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ తండ్రి దగ్గిర మాత్రం లెక్చరన్నమాటకూడా అనకూడదు.

వెంక-- అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి?

గిరీశం-- అది పోలిటిక్సు దెబ్బోయ్‌! ఆ తరవాత కథవిను. నామీద కాకలేసిన తరవాత కోపవఁణక్క, ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. ఇంతలో మీ అప్ప వొచ్చి గుమ్మం దగ్గిర నిలబడి కోకిలకంఠంతో