ఈ పుట ఆమోదించబడ్డది

కరట-- అట్టేఅట్టే, మనఃప్రభవానలవఁంటే యేవిఁట్రా?

వెంకటేశం-- (యింటికప్పువేపుచూసి వూరుకుండును.)

గిరీశం-- పసిపిల్లలకి అలాంటి కఠినవైఁన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి?

అగ్ని-- పద్యాలికి అర్థం చెప్పరూ?

గిరీశం-- యిప్పటిమట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్‌, ఆల్జిబ్రా, మాథమాటిక్స్‌ యివన్ని హడలేసి చెప్తారండి.

కరటక-- (తనలో) తర్ఫీదు మాచక్కగావుంది. వీణ్ణి పెందరాళె తోవపెట్టకపోతే మోసంవొఁస్తుంది.

అగ్ని-- ఇన్నోటి చెప్తారండీ?

గిరీశం-- మరేవఁనుకున్నారు? మీ కుఱ్ఱవాళ్లాగా చదువుకునే వాడికి ఒక నిమిషవైఁనా తెరిపుండదు.

అగ్ని-- అదుగో చదువంటే అష్లాగే చదువుకోవాలి. గొట్టికాయలాడకుండా మావాణ్ణి ఖాయిదాచేస్తే యంత చదువైనా వొస్తుంది.

గిరీశం-- నాదగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి, అలాచదివిస్తానండి.

అగ్ని-- అలాగేచేస్తే మావాడికి చదువొచ్చి అన్నిపరిక్షలూ పాసవుతాడండి. మావాడికి డబ్బుఖర్చులేకుండా పెళ్లయె సాధనంకూడా తటస్థించిందండి.

వెంకమ్మ-- మీ నైజంకొద్దీ ఛిఱ్ఱూ కొఱ్ఱూ మంఛారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవఁలేదా యేవిఁషి? పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని శలవర్జీరాసి వెళ్లిపోయిరమ్మన్నారు కారా? చదువూచెప్పించక పెళ్లీచెయ్యక తీరుతుందా యేమిషి?

కరట-- డబ్బు ఖర్చులేకుండా కొడుక్కి పెళ్లిచేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేవిఁటి? పదిహేను వొందలైనా పోస్తేనేగాని అబ్బికి పిల్లనివ్వరు.

అగ్ని-- డబ్బు ఖర్చులేకుండా వెంకడికి యలా పెళ్లిచేస్తానో నువ్వేచూతువుగాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగార్ని యెరుగుదువా?

కరట-- యరగను.

అగ్ని-- ఆయ్న లక్షాధికారి. పద్ధెనిమిదివందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయఖర్చులూ పెడతారష, పెళ్లి మావైభవంగా చేస్తారష, మనం పిల్లనితీసికెళ్లి వాళ్లింటే పెళ్లిచెయ్యడం, మనకి తట్టుబడి అట్టేవుండదు. ఆపద్ధెనిమిది వొందలూపెట్టి వెంకడికి పెళ్లిచేస్తాను.

వెంకమ్మ-- పెళ్లికొడుక్కెన్నేళ్లు?