ఈ పుట ఆమోదించబడ్డది

మధుర: యెవడికిచ్చావో వాణ్ణే అడగవమ్మా.

పూట: వెధవ కనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడ దాచావేవిఁటి?

మధుర: నాకు దాచడం ఖర్మవేఁమిఁ నేను మొగనాల్నికాను. వెధవముండనీ కాను. నాయింటికొచ్చేవాడు మహరాజులాగ పబ్లీగ్గావస్తాడు. (కంటితో మంచము కిందికి చూపును.)

పూట: మంచంకింద దాగాడేమో ? (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది లేచిరా. (చీపురుగట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును)

రామ: ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండుముండా? (మంచంకింది నించి పైకి వచ్చి వీపు తడుముకొనును).

మధుర: ఆయన్నెందుకు కొట్టావు? నాయింటికొచ్చి యేవిఁటీ రవ్వ?

పూట: అయితె మంచం కిందెందుకు దూరాడూ?

మధుర: నీకెందుకా ఘోష? అదో సరసం.

పూట: ఇదో చీపురుగట్ట సరసం.

రామ: (వీపు తడువుఁకొంటూ) నీ సిగతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంకు మొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకి తోసి తాను గోడవేపు దాగున్నాడు.

పూట: ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా పైకిరా.

గిరీశ: వెఱ్ఱప్పా! మంచం కిందికిరా, వెఱ్ఱివొదల గొడతాను.

పూట: అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతా ననుకున్నావా యేవిఁటి? నీ సానిముండ యెలా అడ్డుకుంటుందో చూస్తాను. (పూటకూళ్ళమ్మ ఒకవేపు నుంచి మంచం కిందికి దూరును. మరి వక వేపు నుండి గిరీశం పైకివచ్చి రామప్పంతులు నెత్తి చరిచి లఘువేసి పెరటివేపు పరిగెత్తిపోవును.)

రామ: సచ్చాన్రా నాయనా (రెండు చేతులు తలపట్టుకొని ) మధురవాణీ యేవీఁ బేహద్బీ! కనిష్టీబు క్కబురంపించూ.

మధుర: యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందురు గాని. (మధురవాణి రామప్పంతుల్ని కౌగలించుకొని తల ముద్దెట్టుకుని చేత రాసి) యేవిఁ దుష్టు! మొగవాడయినవాడు యెదుట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడతాడూ? వాడి పొంకం అణుతురుగాని లెండి.