ఈ పుట ఆమోదించబడ్డది

గిరీశం: నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవడేమాటన్నా నామీద నమ్మడవేఁనా? యీ ఘోరవైఁన అబద్ధాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేననుకున్నావా యేవిఁటి? సప్తసముద్రాల్దాటినా వాడి పిలకట్టుకుని పిస్తోల్తో వళ్ళు తూట్లు పడేటట్టు ఢాఢామని కొట్టకపోతినట్టయినా నా పేరు గిరీశమే నినదభీషణ శంఖము దేవదత్తమే! కబడ్దార్‌ !

మధుర: సముద్రాలవతలకెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యెదటే చెబుతాడు.

రామ: (తనలో) యీముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దైవమా!

గిరీశం: (తనలో) థాంక్‌ గాడ్‌. అయితే పూటకూళ్ళ దాన్దెబ్బతగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గపుకూతలు ఆ యిల్లాలు చెవిని పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపవఁంతా దీన్ని చుట్టుకుంటుంది. ఆమె యెంత పతివ్రత! యెంత యోగ్యురాలు!

మధుర: వెధవముండకి పాతివ్రత్యం అన్న మాట యీనాటికి విన్నాను.

గిరీశం- దానికి....కాదు ఆమెకి మొగుళ్ళేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.

మధుర- మీరుండగా వెధవెలా అవుతుంది?

గిరీశం- నాన్సెన్స్‌ (దీనికో ఠస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగో విను. దాని నిజం యేవిఁటంటే-పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణంలోన్నూ ఆ ముసలాడు పెళ్ళి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తెకట్టాడన్నారు. కొందరు కట్టాలేదన్నారు. పిల్ల తండ్రి, పెళ్ళికొడుకు వారసులు మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గిర లంచంపుచ్చుకొని పుస్తె కట్టలేదని సాక్షవిఁచ్చాడు. దాంతో కేసుపోయింది మరి దాన్నెవరూ పెళ్ళాడారుకారు.

మధుర- అయితే మరి మీకు తప్పులేదే?

గిరీశం-- యేవిఁటి యీ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండావుంది! ఆహాఁ సరసం విరసంలో దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవఁవన్నా ఆనందవేఁ, నిజవఁనిగానీ అంటివా, చూడు నా తడాఖా. యెవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా?

మధుర-- రామ.

రామ-- (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది!

మధుర-- రామ! రామ! ఒహరు చెప్పేదేవిఁటి లోకవంతా కోడై కూస్తూంటేను? (వీధిలోనుంచి తలుపు తలుపు అని ధ్వని.)