ఈ పుట ఆమోదించబడ్డది

వున్నంతవరకు యాకరు పెట్టు. నీదగ్గర కాపర్సు యేవైఁనా వున్నవా? నాదగ్గర కరన్సీ నోట్లు వున్నవి గాని మార్చ లేదు. పదణాలు పెట్టి ఓశేరు కాశీ మిఠాయికొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కట్టుకి వెళ్ళి బండీ కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్‌ ట్రంక్కు వేసి మెట్టుదగ్గిర బండీ నిలబెట్టివుంచు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంతరాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను. గోయెట్వంస్‌ , మైగుడ్‌ బోయ్‌. నువ్‌ బుద్ధిగావుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాథ్‌ బెనర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్నమాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత్త. (వెంకటేశం నిష్క్రమించును.)


ఈ వ్యవహారమొహటి ఫైసలైంది. ఈరాత్రి మధురవాణికి పార్టింగ్‌ విజిట్‌ యివ్వందీ పోకూడదు.

[రాగ వరసతో పాడును]

నీసైటు నాడి లైటు
నిన్ను మిన్న
కాన కున్న
క్వైటు రెచడ్‌ ప్లైటు
మూనులేని నైటు.

[ఒక బంట్రోతు ప్రవేశించును]

బంట్రోతు : నేను పొటిగరాప్పంతులుగారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరాపుల కరీదు యెంటనే యిప్పించమన్నారండి.

గిరీశ : (విననట్టు నటించుతూ)

ఫుల్లుమూను నైటటా,
జాసమిన్ను వైటటా,
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!

బంట్రోతు : యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళ లాగూరుకుండే వాణ్ణి కానండి.

గిరీశ : అయ్యకోనేటికి తోవయిదే;

బంట్రోతు : యక్కడి శెవిఁటిమాలోకం వచ్చిందయ్యా.