ఈ పుట ఆమోదించబడ్డది

[వెంకటేశం ప్రవేశించును]

యేమివాయ్‌ మైడియర్‌ షేక్స్పియర్‌ , ముఖం వేలవేసినావ్‌ ?

వెంక: యిక మీర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చెయడంచాత నాపరీక్ష పోయిందని అన్నారు.

గిరీశ: నాన్సెన్స్‌. మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరుకి నన్ను చూస్తే కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్‌ చేశాడు గాని, లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్‌ కావడవేఁవిటి! అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పాపర్లో యేకేశాను. అప్పట్నుంచీ నేనంటే వాడిక్కడుపుడుకు.

వెంక: మీవల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁ కాని, ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ?

గిరీశ: డామిట్‌. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్‌ ఇన్గ్రాటిట్యూడ్‌ , నాతో మాట్లాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్‌ . ఆ మాట కొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ? విడో మారియేజి విషయవై, నాచ్చి కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కణ్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెణ్‌ కాజెస్‌ ఫర్ది డిజెనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు. మొన్న బెంగాళీవాడు ఈ వూళ్ళో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్‌ , చుట్ట నేర్పినందుకు థాంక్‌ చెయక, తప్పు పట్టుతున్నావ్‌ ? చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడక పోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే.

సూత ఉవాచ: ఖగపతి యమృతముతేగా। భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌। పొగచెట్టై జన్మించెను। పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ ॥

ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్‌ చేసినందుకు నీ మాష్టరు మీద నావళ్ళు మహా మండుతోంది. ఈ మాటు వంటరిగా చూసి వక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా, వూరికి వెళతావా?