ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుద్ధిచెప్పు. తమమూలంగా ఒక ముసలిబ్రాహ్మడికి ముప్పువస్తూవుంటే తమశరీరం దాచుకుంటున్నారు.

శిష్యుడు- (పాడును) "యెఱ్ఱనిముక్కుగలది రామచిలుక । దాని."

మధు- (బెత్తముతో కొట్టబోయినట్టు నటించి) చెప్పినపని చెయ్యకపోతే జయిలుసిద్ధం.

శిష్యుడు- ( "యెన్నాళ్లు బ్రతికినా" అను పాటపాడును. రెండు చరణములు పాడిన తరవాత.)

కరట- అతిజరూరు పనివుంది మధురవాణీ మరోమాటువస్తాను. (నిష్క్రమించుతూ) తల వాయగొట్టింది. తెల్లవెంట్రుకలు లావయినాయి- మనసు కొంచం మళ్లించుకుందాం.



7- వ స్థలము. సౌజన్యారావు పంతులుగారియింట్లో కచేరీగది.

(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు.)


సౌజన్యా- ఇక మిమ్ములను జయించినవాడులేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ?

అగ్ని- అహా. మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మారండి. వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్నికూడా అమ్మడవేఁ జరిగిందష. యిప్పుడు యీ వెధవ యింగీలీషు చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడుగాని, వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వకాలంలో యెంతప్రతిష్ఠగా బతికారు కారు?

సౌజ- పసిపిల్లల్ని కాలంగడిచినవాళ్లకి పెళ్లిచేస్తే వైధవ్యంరాక తప్పుతుందా? నింపాదిచేసి కొంచం యోచించండీ.

అగ్ని- ప్రాలుబ్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి- చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, రాసినరాత యెవడైనా తప్పించగలడా?

సౌజ- మీరు చదువుకున్నవారుగదా, ప్రారబ్ధమని పురుషప్రయత్నం యే వ్యవహారంలో మానేశారు? కేసు, "విధికృతం; యలావుంటే అలా అవుతుందని" వకీల్ని పెట్టడం మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్రదూష్యంకాదా? డబ్బుకిలోభించి పిల్లల్ని ముసలివాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేఁనా? శలవియ్యండి.

అగ్ని- యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసివేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారుకారండీ? గిరీశంగారు చెప్పినట్లు- వాడిపిండం పిల్లులికిపెట్టా!- మీలో ఆడపిల్లలికి యిన్నితులాలు బంగారం పెట్టాలి యిన్నితులాలు వెండిబెట్టాలి అని నిర్నయించుకోవడంలేదా? అదిమాత్రం కాదేం కన్యాశుల్కం?