ఈ పుట ఆమోదించబడ్డది

చూసి నాపెట్టాబాడా దానికే వప్పజెప్పి, ఆమొహురు దాన్నే దాచమన్నాను. అనుమానవేఁసి యిప్పుడు నామోరుతెమ్మంటే, "బట్టలపెట్లో పెట్టాను తాళంపోయింది" అంది. తాళంతాకపోతే రోకలితో బుఱ్ఱ చితకబొడుస్తాను.

లుబ్ధా-- చెయి జేసుకోకు. నీది వెఱ్ఱికోపం చావగొట్టగలవు జాగ్రత!

మీనా-- చస్తే యీడిచిపారేస్తాను. ముండయలా కరిచిందో చూడండీ. యింకా రక్తంకారుతూందీ. మనిషికాటుకి మందులేదన్నాడు.

లుబ్ధా-- కుంకం పెట్టమ్మా.

మీనా-- దానిబుఱ్ఱ చితకబొడిచి మరీ పెడతాను (మీనాక్షి వెళ్లును.)

లుబ్ధా-- గుండుగొమ్ముల అనుమానం తీరిపోయింది - పీకనులివిఁ, వాడైనా చంపేస్తాడు; కరిచి అదైనా చంపేస్తుంది. వీడిచేతో, దానిచేతో, చావుతప్పదు. యెంతడబ్బెట్టి కొనుక్కున్నాన్రా, యీచావుపెళ్లీ! అయ్యో! అయ్యో! దీన్ని పైకి తగిలేస్తే వాడుకూడా విరగడైపోతాడు. అదేసాధనం - యెక్కడికితోలెయ్యను? బండీమీద యెక్కించి పట్ణంతోలేస్తాను - అక్కడగానీ తండ్రి వెధవ కనపడకపోతే మళ్లీ దెయ్యాన్ని నెత్తినిపెట్టుకుని ప్రత్యక్షం అవుతుందే! బండి అద్దె యిచ్చుకోవడవేఁ మిగుల్తుంది - యేమి సాధనం? - యేమిసాధనం? - రావఁప్పంతుల్ని సలహా అడుగుదునా? ఆఁ! మంచి ఆలోచన తోచింది. - రామప్పంతులు నాకు కట్టిపెట్టిన యీ ముండని, వాడిదగ్గిరికే పంపించేస్తాను - సానిదాంతోపాటు దీన్ని కూడా వుంచుకుంటాడు. - కావలిస్తే పదిరూపాయలు దక్షిణతోకూడా యిచ్చేస్తాను.

(మీనాక్షి ప్రవేశించి.)

మీనా-- యక్కడా కనపడదు నాన్నా గుంట.

లుబ్ధా-- నూతులో పళ్లేదుగద?

మీనా-- యేమో!

లుబ్ధా-- పరిగెత్తెళ్లి గవరైని పిలవమను. దాన్ని నువ్వు చావగొట్టలేదుగద?

మీనా-- కనపడితేనా?

లుబ్ధా-- యేవిఁటినాయనా, యీకొత్త ఉపద్రం!

(నిష్క్రమింతురు.)

2-వ స్థలము. రామప్పంతులు యింట్లో కొట్టుగది.

(భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. పూజారి గవరయ్య ఆట చూచుచుండును.)

పోలిశెట్టి-- యేంభష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూనువ్వింతేను.