ఈ పుట ఆమోదించబడ్డది

నీచెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మరి రెండు రోజులికి మనం పెళ్లాడావఁని తెలుస్తుంది. నిన్ను ముసలివాడికి కట్టిబెట్టినందువల్ల కలిగిన చిక్కులు చూస్తూ, నీతండ్రి నీచెల్లెలికి మళ్లీ ముసలిసంబంధం చెయ్యడు. నీతండ్రి ఒకవేళ మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా, మన తమాషా విన్నతరవాత, నా అన్న నీ చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు. యిది సిద్ధాంతం. అవునాకాదా?

బుచ్చ-- అవును కాబోలు.

గిరీ-- అయితే మరి అందుకు సమ్మతేనా?

బుచ్చ-- యెందుకు?

గిరీ-- నాతో వెళ్లిపోయి రావడానికి.

బుచ్చ-- అమ్మ నాయనా, నా ప్రాణంపోతే నేను మీతోరాను.

గిరీ-- రాకపోతే, మీచెల్లెలికి యీపెళ్లీ తప్పదూ, నాకు చావూ తప్పదూ.

బుచ్చ -- అలా అనకండి.

గిరీ-- అనకపోతేమాత్రం, చావు తప్పేదుందిగనకనా? నిన్ను వొదిలి బతకలేను, అది వకచావు. నువ్వు నామీద వొట్టువేసుకుని ఆమాట తప్పిపోతే, నన్ను దేవుఁడే చంపేస్తాడు. అది రెండోచావు. మరి నాకు చావు యెలా తప్పుతుంది?

బుచ్చ-- నానించి మీరు చచ్చిపోతే, నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి.

గిరీ-- నావశవాఁ? అడుగో నీతమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు మాట్లాడుకోడానికి వీలుచిక్కదు. ఒక్కమాట చెప్పు. బతకమన్నావా? చావమన్నావా?

బుచ్చ-- వెయ్యేళ్లూ బతకండి.

గిరీ -- అలాగైతే, నాతోరావడం ఖాయవేఁనా?

బుచ్చ-- యేంజెయమంటే అది చాస్తాను.

(వెంకటేశం మిడతనుపట్టుకు ప్రవేశించును.)

వెంక-- యిదుగోనండోయి, గొల్లభావఁనిపట్టుకున్నాను.

గిరీ-- చూశావూ, వొదినా! నీతమ్ముడు చిన్నగుంటడయీ, అప్పుడే గొల్లభావఁల్ని పట్టు గుంటున్నాడు.

బుచ్చ-- (ముసిముసినవ్వు నవ్వుచు) మిడత!

గిరీ-- (బుచ్చమ్మతో) యిన్నాళ్లకి మిడతంభొట్లు చేతులో చిక్కాడు. (వెంకటేశంతో) యిలాతే - మిడతల్ని పట్టుకోవడం మంచి ఎడ్యుకేషన్‌. యిదే, నాచురల్‌ హిస్టరీ, ప్రకృతిశాస్త్రం అంటారు.

వెంక-- అక్కయ్యా - కొంచం ఊరుబిండి!

బుచ్చ-- అమ్మ చూస్తే తంతుంది.

వెంక-- అమ్మచూడదులే. (వూరుబిండి చేతులో వేసుకుని నాలుకతోనాకి గెంతును.)

(తెరదించవలెను.)