ఈ పుట ఆమోదించబడ్డది

రామ-- అతడేడీ, అతడు? అతడిపేరేవిఁటీ?

పూజారి-- యెవరండి?

రామ-- ఆగుంటూరి శాస్తూల్లేడయ్యా?

పూజారి-- యేగుంటూరి శాస్తుల్లండి?

లుబ్ధా-- ఆయనా, - మరేవొచ్చి, ఆయనా-వూరి కెళ్లారు.

రామ-- యేవిఁటీ తెలివితక్కువమాట! కూతురికి పెళ్లౌతూంటే, వూరికెళావెళ్లాడు?

లుబ్ధా-- పెళ్లయిపోయిందిగదా?

రామ-- తెలివిహీనం! లగ్నవఁంటే నేను లేకుండా వెలిగించావుగానీ, పెళ్లి ఐదురోజులు తగలడుతుందిగదూ?-

పూజారి-- ఏకరాత్ర వివాహం కదండీ? అంచేత ప్రధానహోమం, శేషహోమంతో సమాప్తి అయిపోయింది.

రామ-- (నిశ్చేష్టుడై లుబ్ధావధాన్లుతో) ఓరి, సామిద్రోహప వెధవా!

పూజారి-- (నోరుమూసి) బాబ్బాబూ, శాంతించండి! శాంతించండి! (లుబ్ధావధాన్లుతో) పంతులుగారి కాళ్లమీద పడవయ్యా. (పంతులుతో) తమరు చేయించిన శుభం. అశుభంమాటలు శలవియ్యకండి. సిద్ధాంతిగారూ, వారి మావఁగారూ, శాస్త్రచర్చచేసి, లగ్నం పదినిమిషాలుందనగా, ఏకరాత్ర వివాహం స్థిరపర్చారు.

రామ-- యేంకుట్ర! వాడికి రూపాయలివ్వలేదుగద?

లుబ్ధా-- యెల్లుండి యేవా`ళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని, తొందరపడి పట్టుకు వెళ్లిపోయినారు. మళ్లీ వారంనాటికి వొస్తానఁన్నారు.

రామ-- నన్ను మధ్యవర్తినిచేసి, నేను లేనిదీ, యీ వ్యవహారం యలా పైసలుచేశావు? నేను యంత యడ్వాన్సు వాడికియిచ్చానో నీకు తెలుసునూ? అప్పుడే మావఁగారితో కలిసిపోయి నాకు టోపీ అల్లావూ?

లుబ్ధా-- మీరుచేసిన నిర్నయప్రకారవేఁ, రూపాయలు చేతులో పడితేనేగాని, పుస్తెకట్ట నివ్వనన్నాడు. యేంజెయ్యను?

రామ-- పుస్తెకట్టకపోతే నీపుట్టె ములిగిందిగాబోలు! నేవొచ్చేలోగా యేం వుప్పెనవొచ్చింది? వీడేదో పెద్దదగాచేసి, నేనొస్తే, పట్టుగుంటానని రూపాయలు చేతులో పడేసుకుని వుడాయించాడు. వాడిపేరేవిఁటీ?

పూజారి-- ఆయన పేరు-మరేవచ్చి-అవుధాన్లుగారు శలవిస్తారు.

లుబ్ధా-- నాకు తెలియదు.

రామ-- అయ్యో అభాజనుడా! యిహ, వాడు, పంచాళీమనిషి అనడానికి సందేహవేఁవిఁటి?