ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. నెక్కొని మింటనుండి తెగి నేలకురాలినరిక్కరీతి, వి
   ల్లెక్కిడి వ్యాధుఁడేయ గుఱియేటునఁ గూలిన పక్కిభాతి, నే
   దిక్కును లేక నేనకట! తీవ్రతరంబగు మారుతాహతిన్
   గ్రక్కునఁగూలినానొకయగాధమహార్ణవ మధ్యమందునన్.

సాగరమునందలి కంకణము

ఆ.వె. కూలి సొమ్మసిల్లి కులమువారి కృపోప
      చారవిధుల సేద దేరి, దైవ
      మా! భవార్ణవమున మఱలఁ ద్రోసితె యని
      భోరుభోరుమనుచుఁ బొరలి యేడ్చి.

చ. క్రమముగఁ గన్నువిచ్చితిని గాంచితిలోకము, లోకమెల్ల సం
   ద్రమె యనుకొంటి బుద్బుదవితానములే ప్రజలంచు నెంచితిన్
   సమతయు శాంతి నిశ్చలత సాగనియిందలి సర్వజీవన
   క్రమముల గుర్తెఱింగితి నగాధవిషాదపయోధి మున్గితిన్.

ఉ. సంతత మీయపారమగు సాగరమందలి జీవనంబుతో
   నెంతయు నంటి యంటనటు లేఁ జరియింపఁగ నెంచి, దేనినా
   శింతును నాశ్రయింతు నను చింతమునింగితిఁ గాని జీవనా
   క్రాంతముగాని సాధనము గానఁగనైతిని నెన్నిభంగులన్.

ఉ. జీవనధర్మమూనియును జీవసమం దెటు లంటి యంటన
   ట్లే విహరింపనేర్తు? నగరే వినిరే నెవరేని నన్ను? నా
   కేవెరవున్ స్ఫురింప కెద నింతతలంచుకొలందిఁ దోఁచు నా
   నావిధసంశయమ్ములుమనమ్ముఁ గలంచెఁ దొలంచె ధైర్యమున్.