ఈ పుట ఆమోదించబడ్డది

సీ. పరమేశ్వరా భానదురిత భావమ్ము వి
            ధాన నాస్తికతాప్రధాన మగుచు
   సంతత క్లిష్ట దుష్ట ప్రబంధంబ ట్ల
            గోచరాఖిలవస్తుగుణము నగుచు
   కపటమిత్రుని మైత్రికరణి క్షణక్షణ
            జాయమాన భయాతిశయము నగుచు
   అతిదరిద్రు మహానసాగారమును బోలెఁ
           జూడఁజూడఁగ సర్వశూన్యమగుచు

   నిర్ధనమనోరథము లీల వ్యర్థమగుచు
   నక్షరాపేతు హృదయమ ట్లంధమగుచుఁ
   ద్యాగరహితు రాజ్యమువోలెఁ ద్యాజ్యమగుచుఁ
   దమము గ్రమ్మినజగ మధమముగ ఁదోచె.

శా. మాకుం గ్రమ్మఱఁగానరాఁ డెచటికమ్మా యానిలుండేఁగెనో
    నాకారామచరత్సురాంగనలఁ గానంబోయెనో లేక గం
    గాకల్లోలవిలాసడోలికల నూఁగంజొచ్చెనో భూతలం
    బాకల్లాడదు నాఁటిరేయిని సమస్తాశాప్ర దేశంబులన్.

ఉ. స్థావరజంగమాత్మకము సర్వజగంబును నాఁడు కేవల
   స్థావరగూపమయ్యెను; గుజవ్రజముల్ చలనస్వభావమున్
   బో విడనాడి పూనెను దపోనియమంబు తమోనివృత్తికిన్
   క్ష్మావలయంబు నిశ్చలసమాధిమునింగెను శాంతిమంతమై.