ఈ పుట ఆమోదించబడ్డది

[ప్రఖ్యాత చరిత్రవేత్తలగు మహా మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ శ్రీ చిలుకూరి నారాయణరావు పంతులుగారు యం.ఏ. పి.హెచ్.డి., యల్.టి., అనంతపురం, గారిచే వ్రాయబడినది.]

ఇంతవరకును భారతదేశ చరిత్ర నిర్మాణము పాశ్చాత్యుల వ్రాతల కనుకరణముగా మాత్రముండి అదియే మన విద్యాలయములలో విద్యార్ధులకు బోధింపబడుచుండుటచేతను, చరిత్రను బోధించు ఉపాధ్యాయులు చరిత్రను గ్రుడ్డిపాఠముగా బోధించుచుండుట చేతను తాము బోధించు విషయములనుగూర్చి తగిన విమర్శ లేక గతానుగతికముగా చరిత్ర విద్యాబోధ సాగుచుండుటచేతను సత్యమైన దేశచరిత్ర మనకింకను లభింపలేదు. ఇంగ్లీషు డిగ్రీలను సంపాదించిన విద్యాధికులు తగిన పరిశీలన లేక వ్రాసిన పాఠ్యచరిత్ర గ్రంథములే ఉపాధ్యాయుల కాశ్రయములగుచున్నవి. భారతదేశ చరిత్రనుగూర్చిన పరిశోధనలలో విద్యాధికులైనవారు వ్రాసిన వ్రాతలలో పరస్పరపొందిక కానవచ్చుటలెదు. ఇది యిట్లుండగా చరిత్ర నిర్మాణమునకు వలయు మూలగ్రంధములు, శాసనాదికములుత్గాక అనాదిగా సంప్రదాయసిద్దముగా వచ్చుచున్న పురాణములమీద దృష్టిని పాశ్చాత్యులు గర్హించి యుండుటచే వానిపై మన వారికిని ప్రమాణదృష్టి తప్పినది. అయినను ప్రాచీన గ్రంధముల నామూలాగ్రముగా పరిశోధించి అందలి సత్యములకును యితరాధారములకును సమన్యమును కల్పించి సిద్ధాంతముల నేర్పరుపగల ధీశాలులు ఆంగ్ల విద్యాధికులు కాని వారు దేశౌన లేకపోలేదు. అట్టి వారిలో ఆంధ్రులలో అగ్రస్థానమును వహింపగలవారు బెజవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కోట వెంకటాచలంపంతులుగారు. వీరితో నాకుమూడేండ్ల నుండియు దగ్గర పరిచయమేగాక స్నేహముకూడ నేర్పడినది. భారతీయ విజ్ఞానము, భారతతీయులచరిత్ర, భారతీయుల సాంప్రదాయములను గురించిన సత్యములను లోకమున కెరుకచేయ వీరు చేయుచున్న కృషి అపారము, అగాధమునైనది. పౌరాణిక విజ్ఞామమునంతటిని అవలోఢనముచేసి మనకు పాఠకులకు సులభముగా అవగాహన మగునట్లు శ్రీ వెంకటాచలంగారు వ్రాసిన కలిశక విజ్ఞానము మూడుభాగములు, ఆంధ్రులెవరు? ఆర్యుల ధృవనివాసఖండనము, మానవసృష్టి విజ్ఞానము మొదలయిన గ్రంధములను చదివి ఆనందించగల భాగ్యము నాకు లభించినది.