పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తల్లి - నిన్నెత్తికొని పోఁ దగినట్టి మనుష్యుఁడు వచ్చినప్పుడు, చూతములే? నేను పోయివత్తు మీ తండ్రి నా నిమిత్తము వేచియుందురు. అని పలికి యారాక్షసరాజపత్ని నిర్గమించినది.

వీరవర్మ వారిసంవాదమంతయుఁ దలుపుదాపున నిలువఁబడి యాకర్ణించెను. అతండు సూక్ష్మబుద్ధియగుట నది పాతాళలోక మనియు నామె రాక్షసపుత్రికయనియు నామె వివాహము నిమిత్తము స్వయంవరము చాటింతురనియు లోనగువిశేషములు కొన్ని గ్రహించి తనరాకను గుఱించి యాలోచించుచు మఱికొన్ని దినములు గడిపెను.

మఱియొకనాఁడచ్చేడియ తనకు వీడియమిచ్చుచుండు నప్పు డా రాజకుమారుఁడా తరుణీమణి మణిబంధము పట్టుకొని ముద్దువెట్టుకొనుచు బాలా ! నీవృత్తాంత రహస్యముజెప్పక నన్ను మోసము చేయుచున్నావు నిజముగా నీవు రంభవైనచో విమానమెక్కి విహరింతము రమ్ము. నన్నీశుద్ధాంశములో దాచుచుంటివేమిటీకి ? నిజము చెప్పు దనక నీచేయి విడువనని పలికిన నవ్వనిత నవ్వుచు నింద్రునికిఁ దెలియకుండ నిన్నిందు దాచుచుంటిని. నీయునికినతం డెఱింగిన బంధింపఁగలఁడు నేను రంభనే నాసౌందర్యము నీకు నచ్చలేదా? నీవు నలకూబరునికన్నఁ జక్కనివాఁడవని నిన్ను వరించితిని. తెలిసినదియా అనుటయు నతండు నీవు రంభవు కావు గాని యూరుహసిత రంభవగుదువు. నే నంత తెలియనివాఁడను కాను నీ పేరు చెప్పువఱకు నిన్నుఁ గదలనీయనని చేయి వదలి కౌఁగిటిలోఁ బిగియఁపట్టెను. అప్పుడాచిన్నది నాధా ! నాపేరు పద్మసేన అనఁబోయి కాదు రంభ నిజము చెప్పినఁ బంధింపవచ్చునా ? విడువుఁడు విడువుఁడు అని పెనఁగులాడుచు నెఱుఁగనదివోలెఁ గొన్ని చిట్టకములు వెలయించుచు నిజముజెప్పెద వదలుఁడని మఱియుఁ బ్రతిమాలినది. కౌఁగిలివదలి యతండు మఱియుఁ గరగ్రహణముజేసి నిజము చెప్పుమని నిర్బంధించెను.