పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మసేనకథ.

85

పలికి తలుపుఁ జేరవైచి ముందరిచావడిలోనికివచ్చి కూర్చుండెను. ఇంతలోఁ దల్లివచ్చి.

తల్లి - అమ్మా! పద్మసేనా! కుశలముగాఁ నుంటివా?

కూఁతురు - కుశలము కాకయేమి?

తల్లి — నీకొకశుభవార్త యెఱింగింపవచ్చితిని వినుము.

కూఁతు - అవహితనైతి నెఱింగింపుము,

తల్లి — నీతండ్రి నీకుఁ గొన్నిసంబంధములుతెచ్చిరి కానివాని నేనొల్లక స్వయంవరము చాటింపింపుఁడని చెప్పితిని ఆపధ్ధతినీకిష్టమేనా.

కూఁతు - ఎక్కడ చాటింపుమంటివి!

తల్లి - మనజాతివారు రక్కసులు వసించియున్న సుతలాది సప్త పాతాళలోకములలోను.

కూఁతు — రక్కసులం బెండ్లియాడనని నేనిదివఱకు నీతోఁ జెప్పలేదా

తల్లి - రక్కసులకుఁగాక నిన్ను మీతండ్రి శత్రువులైన దేవతలకును గబళములైన మానవులకు నిత్తురనుకొంటివా యేమి? వచ్చిన వారిలో నచ్చినవానిం బరిగ్రహింపుము.

కూఁతు - నాకు రాక్షసజాతీయే నచ్చలేదు.

తల్లి — పుత్రీ! నీకు మాతృసాంప్రదాయము వచ్చినది. యేమిచేయుదుము నన్ను మీతండ్రి నందనవనములో విహరింపుచుండగా బలాత్కరముగా నెత్తికొనివచ్చి పెండ్లియాడిరి. నేనచ్చరజాతి దాననైనను దానవునితోఁ గాపురము సేయుచుండలేదా ? దానవులలో మాత్రము మంచివారు లేరను కొనుచుంటివా యేమి. ప్రహ్లాదుఁడు బలి మొదలగువారు దానవులు కారా.

కూఁతు - ఆగొడవయంతయు నాకవసరము లేదు. నన్ను మనుష్యుఁ డెత్తికొనిపోయి పెండ్లియాడిన నేమి చేయుదురు ?