పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మసేనకథ.

83

కాంతామణీ! ఇది యేలోకము! నీవెవ్వని పుత్రికవు? నేనిక్కడి కెట్లువచ్చితిని? నాకునపూర్వోప చారములు సేయుచున్న నీకులశీలనామంబులువివరించి శ్రోత్రానందముగావింపుము. అనియడుగుటయుఁ జిఱునగవుతో నమ్మగువ యిట్లనియె.

ఆర్యా! మీరేదేశమువారో యెవ్వనికుమారులో యిక్కడి కెట్లువచ్చితిరో మీవృత్తాంతము ముందు మాకెఱింగించిన పిమ్మటఁ దరువాత మాకధ యెఱిగింతుమని పలికిన విని యారాజనందనుండు తాను తాళధ్వజునికుమారుండననియుఁ దమ్మునితో దిగ్విజయయాత్ర వెడలుటయు మునీశ్వరుని శాసనప్రకారము చిత్రకూటమెక్కి గర్తములోఁ బడిపోవుటయు లోనగువృత్తాంతమంతయుంజెప్పి అంతవట్టు నాకు జ్ఞాపకమున్నది పిమ్మట నేమిజరిగినదియో తెలియదు. అతండు సత్యర్షియేయైనచో నిది దిక్పతులనగరములలో నొకటికావలయు నీవు దేవకన్యకవు కావలయు నిఁకనున్న తెఱంగెఱింగింప నీ వేప్రమాణమని పలికి యూరకున్నంత నాజవ్వనిలేనవ్వు మొగంబునకునగయై యొప్ప నిట్లనియె.

రాజపుత్రా! మీమాట కన్యధాత్వమేలవచ్చును. ఇది నాకలోకమే. నేను రంభను. అదినాచెలికత్తెయ మేము దేవవేశ్యలమగుట నిన్నంటినదోషముండదు నీవుగావించిన సుకృతముచేఁ ప్రీతులమైతిమి. నీసేవసేయుటయే మాకు విధికృత్యము విస్రబ్ధముగా శయనింపుఁడు కావలసినపదార్ధములడిగి తీసికొనుఁడు. ఇదిస్వగృహములాగుదలంచి యుపచారములఁ జేయించుకొనుఁడు అనిపలికినవిని యక్కలికికతండిట్లనియె.

రాజపుత్రుఁడు - బోటీ! నీమాటలువినఁ బరిహాసజల్పితములు వలెఁదోచుచున్నవి. నీవు నిజముగా రంభ వే?

పద్మసేన — సందేహమేమిటికి ! నేనురంభనే నన్ను మీరు నిర్భయముగా ననుభవించవచ్చును.