పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నరమాంసము నీవుదెలియకుండ నితరులకీయఁ దీసికొనిపోవుచుంటి నిది యెట్టియపరాధమను కొంటివి? పో. పొమ్ము. రాజపుత్రిక మంచిది గనుక నీయాపదదాటినది దీనిమేము దీసికొనిపోయెద మనిచెప్పి వానిం బొమ్మని మెల్లగా నతనిశరీరము నొవ్వకుండ నెత్తి తమబండిలోఁ బండుకొనఁబెట్టి తమపుట్టము చెఱంగుగప్పి యప్పుడే తమయంతఃపురమునకుఁ దీసికొనిపోయి అందొకమెత్తని పానుపునం బవ్వళింపఁజేసి,

ఆ. గీ. చమురురాచికాచి సందులఁగదలించి
         కట్లుకట్టి పెక్కు పట్లువైచి
         వేడినీళ్ళఁగడిగి వెసగాత్రములనెల్ల
         సాగఁదీసిలాగిచక్కఁబడఁగ.

గీ. బాలునకుఁబోలె నోటిలోఁ బాలుబోసి
    త్రాగఁజేయుచుఁబెక్కు వైద్యములుసేయఁ
    గలిగే వానికిస్మృతి యొక్క నెలకు వారి
    గన్ను లెత్తి పరీక్షించి కలయఁజూచె.

ఆహా! నేనాగర్తములోఁబడి యీదివ్యభవనములోని కెట్లువచ్చితిని? నాకుపచారముచేయుచున్న యీజవరాండ్రెవ్వరు? తెలిసినది. ఇది స్వర్గలోకములోని సౌధముకావచ్చును. ఆగుహాంతరమునుండి దిక్పాలుర నగరములు గనంబడునని యయ్యతీశ్వరుఁడు సెప్పలేదా? అది కైతవమని యమ్మునిపతి నిందించితిని. నాపాపముశమించుఁగాక. వీరు దేవకన్యకలు అనితలంచుచుండ రాజపుత్రికవచ్చి వానిప్రక్కలోఁ గూర్చుండి మేను నివురుచు మొగము దుడుచుచు బంగరుగిన్నెతోఁ బాలుదెచ్చి సుందరుఁడా! నాపుణ్యమునఁ బ్రతికితివి. పాలుగ్రోలుము నోరుతెఱచుము. అనిలాలించి బలుకుటయు నతండు కడుపునిండఁ బాలు ద్రావి బలముగలిగి తనప్రక్కలోఁ గూర్చున్న యామెమొగము సాభి ప్రాయముగాఁ జూచుచు నిట్లనియె.