పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అప్పు డతండాత్మగతంబున నౌరా! ఆకపటాత్ముఁడు నన్నెంత మోసముజేసెను? నన్నిట్లీయగాధ గర్తములోఁ బడద్రోయ వానికేమి ఫలమువచ్చెను. ఒకవేళఁ బోవం బోవ దిక్పతులనగరములు గనంబడునా? సీ నాకిదేటియూహ. ఈజాఱుటవలన నాకాయాసమధికమగుచున్నది. ఇఁకగడియలోఁ బ్రాణములు బోఁగలవు. అక్కటా మాతల్లిమాట వినకపోవుటచే నీముప్పువాటిల్లినది. మాయునికిఁ దెలియకెంత చింతించునో? మాతమ్ముఁడుగూడ నన్ను వెదకుచువచ్చి వీనిమాయకు జిక్కునేమో! అని యనేకవిధంబులఁదలంచుచుండ గొంతసేపటికి వానికి స్మృతి దప్పినది.

గోపా! వినుమతండొకదివసంబెల్ల జాఱిజాఱి తుద నొక విశాల శిలాఫలకంబునందలి యిసుకపఱుపు పయింబడియెను ఆదేహమట్లుపడినతోడనే యంచుఁగావున్న రక్కసుండొక్కడొక బడియతో వానితల మీఁద వేయఁబోయిన ఆ వలదు వలదు నిలునిలుమని యాప్రక్కనే కూర్చున్న లంబోదరియను రాత్రించరి వారించినది. ఆమాటవిని యా దానవుఁడు దేవీ! అట్లంటివేమి? ఈకళేబరములో నింకను బ్రాణములున్నవి. పూర్తిగాజంపి రాజుగారివంటశాలకు దీసికొనిపోవలదా? అని యడిగిన నాదానవి కుంభా! ఇటురా. చెవిలోమాట. నీవునరాంతకు నెఱుంగుదువా! వాఁడు నాకుఁ జుట్టమగును. వాని యిల్లాలు చూలాలై యున్నది. సద్యోహతనరశవమాంసము దిన వేడుకపడుచున్నదఁట అందులకై వాఁడు నన్నాశ్రయించుచున్నాడు. ఎల్లుండి యామెకు సీమంతోత్సవము గావింతురఁట. అప్పటికెట్లైన నట్టిమాంసము సంపాదించి పంపుమని బ్రతిమాలికొనియెను. ఇప్పుడువీనింజంపినచో నెల్లుండికాకళేబరముక్రుళ్లి పోవును. వీఁడుసగముచచ్చియున్నాడు. ఎల్లుండికిఁబూర్తిగాఁ బ్రాణములు పోవును. పోకున్నను వాండ్రేకడ తేర్తురు. నీవీ కళేబరము నీతట్టలో నిమిడించుకొని మూతబెట్టి వారింటికిఁ దీసికొని