పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరవర్మకథ.

77

గుప్తంబై విచిత్రముగాఁ గనంబడుటయు రాజకుమారుండా మునిశిష్యునితో నార్యా! ఇదియేమి? సౌధద్వాంరంబా గుహాముఖంబా? దీనిలో నెవ్వరైననుండిరా? అని యడిగిన నాశిష్యుండు రాజుపుత్రా! ఇదియేకాదా మాగురుఁ డెఱింగించిన కందరము దీనిలోపలికిఁబోయి చూచిన దిక్పాలురనగరంబులు గనంబడునని జెప్పెను.

వానింజూడ వేగిరపడుచు నానృపకమారుండు పదపదతలుపులు తీయుము దారిజూపుమని తొందరపెట్టిన వాఁడు. రాజపుత్రా! ఈ తలుపులు బలశాలులుగాని తీయలేరు నావలనఁగానేరదు నీవు రమ్ము. త్రోయుమని యుపాయముచెప్పిన నతండొక్కత్రోపుతో నాకవాటముల తెరచివైచెను. తదంతరంబు మిక్కిలి విశాలముగానున్నది. కుడ్యభాగములు విచిత్రచిత్రప్రతిమలచే నిండింపంబడి యున్నవి తద్విశేషములరయుచు రాజకుమారుఁడు మెల్లగాలోనికి నడచుచుండెను. వెనుక శిష్యుఁడు పోవుచుండెను.

కొంతదూరమరిగి యతండార్యా ! దిక్పతుల నగరంబులు గనంబడలేదేమి? బొమ్మలేదిక్పతులా వేగ వానిం జూపింపుమని యడిగిన వాఁడిట్లనియె,

రాజపుత్రా! దాపునకువచ్చితిమి అదిగో యాబల్లమీఁద నిలఁబడిచూచిన నావిశేములుగనంబడును దానినెక్కి చూడుమని పలికిన నిజమనికొని యారాజపుత్రుఁడు తటాలున నాబల్లపై కెక్కెను. అప్పుడు గుబేలుమని మీటసడలి యాబల్లయొక గర్తములోనికొఱిగినది. అతండా గర్తములోఁబడి క్రిందికి జాఱదొడఁగెను. ఆసొరంగము గుండ్రముగా నునుపుగానుండి పట్టుకొనుట కేమియు నాధారములేక యంధకారబంధురంబై యొప్పుచున్నది. అతం డందుఁబడి యూరక క్రిందికి జాఱుచుండెను నిమ్నాభిముఖముగా జాఱుచుండుట నతనిమేనికిఁ జాలనొప్పిగాఁ దోచుచుండెను.