పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యింటికడసుఖింపక కయ్యమున కేలకాలుద్రువ్వవలయునుబాబులారా ! యుద్ధమునకుఁ బోవలదు. సుఖంబుండుఁడని గడ్డముపట్టుకొని బ్రతిమాలికొనినది.

అప్పుడు వీరవర్మ నవ్వుచుఁ దల్లీ! నీవు క్షత్రియపుత్రికవు. కావాయేమి? మునికన్యకవలెఁ బిరికిమాట లాడుచుంటివే! వీరమాత లిట్లనవచ్చునా? రాజపుత్రులకు సంగ్రామము సేయక పేరెట్లువచ్చును? ఆఱుమాసములు దేశములు దిరిగి క్రమ్మఱరాఁగలము, పోవుట కాటంకము సెప్పక యనుజ్ఞయిమ్మని ప్రార్ధించెను. ఆమాటల కేమియు సమాధానము జెప్పనేరక విజయమందుఁడు పొండు. అని దీవించివారి యాత్రకనుమతించినది.

ఆరాజకుమారులిరువురు దివ్యాలంకారభూషితులై ధనురాది సాధనంబులధరించి చతురంగ బలంబులు వెంటనంటిరాశుభముహూర్తంబున నిల్లువెడలి ప్రాఙ్ముఖముగాఁ బోయిపోయి యంగ వంగ కళింగాది దేశంబులం జొరఁబడి,

క. శరణాగతులగు నృపతులఁ
    గరుణింపుచు నెదురుకొనిన క్ష్మాపతులన్ సం
    గరమున నోడించి కడుం
    బరిభవ మొనరించి విడుచుఁ వన్నుల గొనుచున్ .

ఇట్లా రాజకుమారద్వయంబు గుమారద్వయంబు భాతి నిర్వక్రపరాక్రమంబున బహుదేశములాక్రమించి భూచక్రాధిపతులనెల్లఁ బాదాక్రాంతులఁ గావించుకొని తమకీర్తిసస్యంబుల నెల్లకడలం జల్లి యల్లుకొనఁజేసి తల్లిచెప్పినగడువుదాటకుండ నింటికింబోదలంచి క్రమ్మఱి వచ్చుచు నొకనాఁడొక మహారణ్యమధ్యంబునమధ్యందిన దినకరకిరణ జాలంబుల వేడిమికోడి యలసినబలంబుల పరితాపంబపనయింప విశ్రమింపఁజేసి మఱియుఁ బయనంబగుచుండు నంతలో,