పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/86

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరవర్మకథ.

73

అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు నయ్యవారు తదనంతరోదంతంబు పై మజిలీయం దిట్లు సెప్పందొడంగెను.

__________

217 వ మజిలీ

వీరవర్మ కథ.

తాళధ్వజుండు కుమారుల కందఱకు వేరు వేరు విద్యామందిరములు వ్యాయామశాలలుగట్టించి తగిన యుపాధ్యాయుల నియమించి విద్యలు గఱపించుచుండెను. అందు వీరవర్మయు సుధన్వుండును పదియారేఁడుల ప్రాయము వచ్చునప్పటికి ధనుర్వేదమంతయు సాంగముగా నభ్యసించిరి. ఇతర విద్యలయందుఁ గూడ నిరుపమానమైన బ్రజ్ఞసంపాదించిరి.

ఒకనాఁడు వీరవర్మ తమ్మునితోఁ గూడఁదండియొద్దకుఁబోయి నమస్కరించి ఆర్యా! మేమిప్పుడు ధనుర్వేదమంతయు జదివితిమి. తత్ఫలం బరయ దిగ్విజయయాత్రసేయ నభిలాషగలుగుచున్నది. అందుల కనుజ్జయిండని కోరిన విని యతండు మీతల్లి నడుగుఁడని కనుసన్న జేసెను. వారు ప్రాంతమందేయున్న యామెకు నమస్కరించుచుఁదమ యభిప్రాయమెఱింగించుటయుఁ గటకటంబడి యాసాధ్వీమణియిట్లనియె

బిడ్డలారా! మీరు విద్యామందిరమునుండి యింటికివచ్చుటకు గడియ యెడమైన నెడదఁ దల్లడిల్ల యుగములైనట్లు తోచును. మీరు విదేశయాత్రకరిగిన బ్రదుకఁగలనా? దిగ్విజయమన మాటలతో నున్నదా! మహాశూరులతోఁ బోరుసంఘటిల్లును. వాడిశరంబులేసి మీ మృదుగాత్రంబులు నాత్రపఱతురు. శత్రువులకు జాలియుండునా ! జయాపజయంబులు దైవాయత్తములు మీరు ధనుర్వేదము జదివితిరేని కాని తత్పరిశ్రమయెట్టిదో యెఱుంగరు యువరాజ్యపట్టభద్రులై