పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కాశీమజిలీకథలు - పదియవభాగము.

చ. అనుచువిపంచిగైకొని ప్రియంబున సుస్వరతానయుక్తి నూ
    తనగతిఁ బాడుచుండ సతి దప్పులఁబట్టుచు నొండువీణ న
    ల్లన బలికించెఁదత్స్వరవిలాసములన్వెరపించు రాగముల్
    జనపతి హాయిహాయి యని సంతసమందుచుఁ గౌఁగలింపఁగన్.

మఱియు నమ్మహారాజు తదీయపాండిత్యవిశేషం బెట్టిదోయని ప్రసంగించి చతుష్షష్టి కళారహస్య వేతృత్వంబు వేదవేదాంగ పరిజ్ఞాతృత్వంబు ప్రకటింపఁ దెలిసికొని యురముపైఁ జేయిడుకొని యాహా ! యీమోహనాంగి వాణీవధూటి యపరావతారమని చెప్పనోపు. ఇన్నివిద్య లెఱిఁగిన కురంగాక్షు లెందైనంగలరాయని యచ్చెరువందుచుఁ గామకళావైదగ్ధ్యంబున నయ్యంబుజాక్షింగూడి రాగసముద్రంబున మునింగి తేలియాడుచుండెను.

మఱియు నాధాత్రీపతి రాజ్యతంత్రంబుల మంత్రులయధీనముగావించి యమ్మించుఁబోఁడితోఁగూడికొని మధుమాసముల ఫలదళకుసుమ కిసలయవిలసితములగు నుద్యానవనంబుల మధుకరరవ ముఖరితములగు చందనవాటికలమయూర కే కారవబంధురంబులగు క్రీడాశైలకందరంబులహంస కారండవాదిజలవికిరనికరవిరుత మనోహరంబులగు సరోవరతీరంబుల నదీసికతాతలంబుల సముద్రతటంబుల మనోజ్ఞప్రదేశంబుల విహరింపుచుఁ గ్రీడాపరతంత్రుఁడై పెద్దకాలము తృటిగా వెళ్ళించెను.

సౌభాగ్యసుందరియుఁ దనపూర్వజన్మవృత్తాంత మించుకయుఁ దెలిసికొనలేక లోకపరిపాటి వధూటియుం బోలె విదగ్ధుండగు తాళధ్వజుని కేళీవినోదములఁజిక్కి పరవశయై యొండు తెలియక రాగజలరాశి మునింగి కాలవ్యతిక్రమ మించుకయు నెఱుంగదయ్యెను.

క. పడతింజూడఁగ నిమిషం
   బెడమైనన్ యుగములట్టు లెంచుం బతి దా
   నొడయనిగన నరనిమిషము
   తడవైన న్మేను విడువఁదలచున్ సతియున్.