పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్త్రీజన్మము.

69

యంతఃపురమునఁ బ్రవేశపెట్టించెను మఱియు,

గీ. సూరులెన్నంగ సౌభాగ్యసుందరియని
    సార్ధకాహ్వయముంచె నానరసిజాక్షి
    కతఁడు శుద్ధాంతకాంత లత్యంతగౌర
    వ ప్రపత్తుల నర్చింపఁబ్రభ్వియనుచు.

క. కాలాతిపాత మోర్వక
   బాలామణిఁ బెండ్లియాడెఁ బతి యధికశుభ
   శ్రీలగ్నమందుఁ దద్విభ
   వాలోకనసక్తచిత్తులై ప్రజలొప్పన్ .

ధవళప్రభావిలసితదీపధూపాభిరామంబై బహువిధప్రసూనమాలికామోదబంధురంబై యొప్పు కేళీమందిరంబున నమ్మహారాజు దివ్యభూషణభూషితుండై సకలాలంకార భాసితవేషయగు నాయోషా రత్నమును తనవామపార్శ్వమునఁ గూర్చుండఁబెట్టి పెద్దయుం బొద్దు నర్మగోష్ఠీవిశేషముల వినోదము గలుగఁజేయ నానందించుచు సహచరవర్గంబు నిర్గమించిన తరువాత లజ్జావశంవదయై కదలఁబోయిన నదిమి పోనీయక నాయకుండు శయ్యాతలంబునఁ దలవాల్చికొనియున్న యాయన్ను మిన్నను ముట్టినఁ గందునోయనియుఁ బలుకరించిననా యానపడునోయనియు నెఱుచుచు,

ఉ. హార మణుల్ విచిత్రములటంచుఁ గరంబు నురోజయగ్మముం
    జేరుచు నడ్డబాసతుదిఁజేర్చిన ముత్తెము కెంపుగాఁగ నొ
    ప్పారె నిదేమియంచధరమంటు జడన్ ఘటియించుఁ బుష్పముల్
    జారెనటంచుఁ జెక్కులను జందనముందుడుచు న్నె పంబునన్.

ఉ. అంటినఁ గందునీయొడ లహా సుమకోమలమౌట మాటలం
    గంటకపెట్ట నొప్పిదముగాదిఁక నేమి యొనర్తునొక్కొ? పూ
    వింటివలంతి నాయెడద భిన్నముసేసెడుఁ గాన నాకు వా
    ల్గంటి ! మహోపచారకములం నినుఁగొల్చుటయే శుభంబగున్.