పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్త్రీజన్మము.

67

గీ. నూరుమృదుకాంతి వల్వపై కుబికిరాఁగ
    మేనిడాల్తళ్కుగమి మిఱమిట్లుగొలుప
    మహితసకలాంగ సౌభాగ్యమహిమతోడ
    నారదుం డొక్క చక్కని నవలయయ్యె.

అప్పుడమ్మహర్షి కించుకయుఁ బూర్వస్మృతి లేకపోవుటంజేసి తానెవ్వరో తెలిసికొనలేక కర్తవ్య మెఱుంగక జగన్మోహనంబగు తన రూప మూరక చూచుకొనుచు విస్మయము జెందుచు జలమునుండి యొడ్డుపైకెక్కి యున్మత్తవోలెఁ జిత్తమోహముతోఁ దటాకముదెసఁ జూచుచుండెను. అంతలోఁ దాళధ్వజుండను నృపాలుండొకడు చతురంగ బలపరివృతుండై వేటకై యవ్వనమున కరుదెంచి పిపాసాలసుండై దైవవశంబున నత్తటాకంబున చెంతఁజేరి తత్తీరంబున జగన్మోహనాకారంబునం బ్రకాశించు నమ్మించుఁబోడింగాంచి పంచశరచంచలిత హృదయుండై యబ్బురముగాఁ జూచుచు నిట్లనియె.

సీ. పొలతి! నీవెవ్వని పుత్రిక వొంటి నీ
             వనమున కేమీట వచ్చినావు
    అతివ! నీనామధేయాక్షరంబులను గ
             ర్ణోత్సవంబుగఁ జెప్పు మొకట నాకు
    గలికి! నీయాకృతిగన నురగరుడోర
             గాదిఖేచరకన్య వనుచుఁ దోచె
    నాతి! నూతనయౌవనవిభూషితాంగివై
             తగు నిన్నుఁజూడ డెందము చలించె

గీ. నెలఁత! సౌందర్యరాశివౌ నీవు నన్ను
    గనుల వీక్షింపు మమర సౌఖ్యములభించు
    సరసి దెసజూచుచుంటి వచ్చటఁ ద్వదీయు
    లెవ్వరుండిరొ వచియింపు మింతి నాకు.