పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్త్రీజన్మము.

65

జితమారుతులగు యతులు, స్యాంఖులు, తాపసులు, యోగులు, బ్రహ్మాదిదేవతలు, విద్వాంసులు, మూర్ఖులు గూడ త్రిగుణాత్మకమగు నమ్మాయను జయింపఁజాలరు. ఆ మాయ కాలస్వరూపమై యొప్పుచుండును. ఆకాలమొకప్పుడు ధర్మజ్ఞుఁగూడ వికలుంగావించును. కావున సాధ్వియగుకాంత యెట్టివాఁడైనను బరపురుషునిచెంత వసింపరాదు. దానంజేసి కమలయవలఁబోయినది. ఇందులకుఁ జింతించెదవేమిటికని పలికిన విని నారదుండించుక సిగ్గుఁజెందుచు నిట్లనియె.

తాతా! మాయాబలమున ధర్మజ్ఞుండుగూడ విపరీతమతియగునని చెప్పితివి. తత్స్వరూప మెట్టిదో యేయాధారముగలదియోప్రత్యక్షముగాఁ జూచినంగాని నామనసు సమాధానము పడకున్నది తద్విశేషము జూపఁగోరెదనని యడిగినవిని ముకుందుడు మందహాసము గావింపుచు వత్సా! సర్వాధారమైన యామాయ జగంబంతయు నిండియున్నది. ఇచ్చగలదేని తత్ప్రభావము జూపింతు నాతోరమ్ము. అనిపలికి గరుత్మంతుని స్మరించుటయు నవ్విహగపతి సన్నిహితుండయ్యెను.

విష్ణుండు నారదునితోఁగూడ నానీడజవరంబు నధిష్ఠించి యుత్తరాభిముఖముగాఁబోవుచు బహువిధఫలదళకిసలయవిలసితములగు తపోవనంబులు శరభశార్థూలాది మృగభయంకరము లగు మహారణ్యములు కమల కల్హారవాసితములగు సరోవరంబులు నగాధజలపూరితంబుల గుహ్రదంబులు బహుజనాకీర్ణంబులగు పురగ్రామపక్కణ విశేషంబులం జూచుచుఁ బెద్దదూరమరిగి యరిగి కన్యాకుజ్జమను పట్టణంబున కల్లంతదవ్వులోఁ జక్రవాక హంసకారండవాది జలవికిర పరివృతంబు బంకజపరాగరంజితంబునగు కాసారమొకండు నేత్రపర్వంబు గావించుటయు వాసుదేవుండు గరుత్మంతునాపి నారదున కిట్లనియె.

క. సారసనాద సువాసిత
   సారసవనముదిత సాంధజనమగు నా కా