పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వోయిన మోముతో స్వామీ ! మీదయవలన నన్నిలోకములవారు సుఖులై యున్నవారు. ఎచ్చటను నే విశేషము గనంబడదు. ఇందే క్రొత్తవింత బొడఁగంటి వినుఁడు.

క. ఏ నటుఁడఁగాను ధూర్తుఁడ
   గాను భుజంగు డనుగాను కామక్రోధా
   ధీనుఁడఁగాను జితేంద్రియుఁ
   డైన తపోధనుఁడ దావకాంఘ్రిప్రియుఁడన్.

గీ. ఇట్టి నన్నుఁ జూచి యేకాంతవాసంబు
   జేరె లోకమాత సిగ్గుతోడ
   యతులయెడల నిట్టి యాటంకములుసూప
   నెట్లు కొలుచు వారమింకనిన్ను.

మఱియు నేను వీణాగాన పరిశ్రమ సేయుటం బట్టి నీయిల్లాలు నన్నుఁ గాయకుంగాఁ దలంచినదేమో యది యసంభావ్యంబు గాయత్రసామంబు సంతతము బాడుచు నిన్నుఁ గీర్తించుట వేదసమ్మతము గాని దూష్యంబు గానేరదు సంసారమాయాబలంబు దెలిసికొని సంపదలరోసి భవత్సేవారతుండనై యరుదెంచిన నన్నుఁ జూచి లోపలికేగుట నాకు మిక్కిలి యవమానకరముగానున్నది. తాతా ! నీవైన వలదని చెప్పితివి కావుగదా! అని సాభిమానముగాఁ బలికిన విని జనార్దనుండు నవ్వుచు నారదా! నీవింతబేలవైతివేమి ! నీశాస్త్ర పరిశ్రమయంతయు వ్యర్ధమైనట్లు తోచుచున్న దే. మాయాప్రభావంబు దెలియనివాఁడవగుట ని ట్లంటివి వినుము.

క. మాయాబలమరయఁగ దు
   ర్జేయముబ్రహ్మాదులకు న జేయంబహహా
   పాయకనది మోహితులం
   జేయు మహామునులనైనఁ జెప్పఁగనేలా ?