పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద వివాహము.

61

ప్రాణేశ్వరా ! నే నెవ్వతె ననుకొంటిరి ? వెనుకటి జన్మమున మీభార్యను మాలావతిని తెలిసినదియా ! మదీయపాతివ్రత్యమహత్వంబున జూతిస్మరత్వము గలిగినది. మీరు దాసీపుత్రులై జనించినప్పుడు మీవియోగమునకు వగచుచు మీకు భార్య యయ్యెడు తలంపుతో వేల్పులవలన వరములువడసి యిందు జన్మించితిని. మీయనురాగము వేయిజన్మములకైన మఱుపువచ్చునా? వెనుకటి ప్రేమదలంచి నన్నుఁ బాణిగ్రహణముజేసికొనుఁడు. అనిపలికిననారదుండులికిపడి యిట్లనియె.

ఓహోహో! నీవు మాలావతివా! తెలిసినది ఔను నేను దాసీపుత్రజన్మము విడిచి తిరుగా బ్రహ్మలోకమున కరిగితిని నన్నుఁ జూచి మాతండ్రి క్రమ్మఱ నిర్బంధించుచు నీప్రియురాలు మాలావతి సృంజయునింట జనించినది. ఆయెలనాగ నీకుఁ దగినదగుటఁ బెండ్లి యాడుమని నియోగించెను. నేనంగీకరించితిని కాను. ఆహా! విధిఘటితంబననిదియేకాఁబోలు! ఇన్ని దేశములుండ నేనిక్కడకే రావలయునా? పూర్వజన్మ వాసనావిశేషమువలననేనామదియిట్లు చలించినది. అక్కటా తండ్రిగారి శాపమునన్నెట్లు బాధించినదో చూడుము. గంధర్వుఁడనై పెద్దకాలము గ్రామ్యధర్మనిరతుండనై కడపితిని. తద్ధేతుకముగాశూద్ర యోనిం జనించితిని. ఇప్పటికైన విముక్తిబొందుదమన్న నీవువెంటా డించుచుంటివేమిసేయుదును? సాధ్వీ! నాజోలికిరాకుము నన్నుఁ బోనిమ్ము కరుణింపుమని బ్రతిమాలిన దమయంతి యిట్లనియె.

మహాత్మా! నేను మిమ్ము వరించుట కామాభిలాషచేతగాదు భోగవిముఖనైమీశుశ్రూషచేయుచు ముక్తినొందవలెననికోరియుంటిని మనసులువిరక్తినొంద నెందున్న నేమి? ఇందులకుఁ జింతిల్లవలదు. అనుమతింపుఁడని వినయముగాఁ బ్రార్ధించినది. అతండనుమతించెను. సృంజయుఁ డిష్టములేకున్నను నారదునకు దమయంతినిచ్చి వివాహము గావించెను. అంతలో యదృచ్ఛముగాఁ బర్వతుఁడరుదెంచి స్వర్గభ్రష్టత్వ