పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/73

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సృంజయుండును మంత్రిముఖముగా నావార్త నారదున కెఱింగించుటయు నతండును దనప్రమాదము దెలిసికొని పశ్చాత్తాపము జెందుచు నప్పని కంగీకరింపనని ప్రత్యుత్తరమిచ్చెను. సృంజయుండు సంతసించుచు నామాట కూఁతునకుం దెలియజేయుఁడని నియమించెను. దమయంతి యావార్త మంత్రులవలనవిని యమ్మఱునాఁడు తాను జక్కగా నలంకరించుకొని నారదుఁడు పాడుచుండ దాపునఁ గూర్చుండి యాలించి వివశయై ముఱియుచు గానావసానంబునఁ జేఁతులు జోడించి యమ్మునీశ్వరున కిట్లనియె.

స్వామీ ! నేను భవదీయగాననాదామృతము గ్రోలిచొక్కితిని నాయింద్రియములన్నియు మీయధీనము లైనవి నేను మిమ్మే భర్తగాఁ గోరికొనియుంటి మీ పాదశుశ్రూషజేసి కృతార్ధురాల నగుదునని తలంచుచుంటి. నాదబ్రహ్మవేత్తలగు మీసేవకన్నఁ దరింపఁజేయ మఱియొక సాధనములేదు. నన్ను భార్యగా శిష్యురాలిగా దాదిగా ననుగ్రహించి స్వీకరింపవలయు లేకున్న నాకు మృతియే గతియని ప్రార్థించిన విని నారదుం డించుక తలయెత్తి యిట్లనియె.

తరుణీమణీ ! నీవు రాజపుత్రికవు. నేను తాపసుండ వానర ముఖుండ నన్ను నీవు బెండ్లియాడినఁ జూచినవారు నవ్వరా. నీ శుశ్రూషవలన నామనసించుక చలించినది. ఆప్రమాదము దాటించుకొంటి స్త్రీ సంపర్క మిఁక నంగీకరింపను తండ్రిగారి శాపమువలన నా కీవ్యామోహము గలుగుచున్నది. అక్కటా చాతుర్మాస్యవ్రత మేడ నీశుశ్రూషయేడ ? ఈవివాహ ప్రయత్న మేడ ? నే నొకచో నిలువరాదు మూడులోకములు తిరుగుచుండవలయును. వ్రతము పూర్తియైనది. పోయివచ్చెద ననుజ్ఞ యిమ్ము నీవలపు నాకాలికి సంకెలియై కదలనిచ్చినది కాదు. మోహము దెలిసికొంటి వలదు సంగమువలదని యుత్తరమిచ్చిన నమ్మచ్చెకంటి యల్లన ని ట్లయె.