పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద వివాహము.

59

మనుష్యునికన్నను హీనుఁడుసుమీ! దేవేంద్రుఁడైనను రసజ్ఞానము లేనిచోఁ బశువే. ఎవ్వడుమూర్చనా తానమార్గమువిని యానందింపఁడో వాఁడుగూడ పశువే మృగములు పశువులుకావు. రసజ్ఞానము లేనివానికన్న విషధరమే శ్రేష్టమైనది. చెవులులేకున్నను సంగీతమువిని యానందించును. చీ చీ చెవులున్నను గొందఱు గానప్రీతిలేనివారగుచున్నారు. శిశువులుగూడ సుస్వరయుక్తమగు గానమువిని యానందింతురు.

అక్కటా! నాతండ్రి నాదమహాత్మ్యమేమియు నెఱుంగఁడు నారదుఁడెవ్వడో యెట్టివాఁడో తెలిసికొనఁ జాలఁడు అట్టిప్రభావసంపన్నుఁడు మఱియొకఁడులేడు. ముమ్మాటికిని లేడు. అతనికి నాచేత వరింపఁబడినతరువాతఁ గోఁతిమొగమువచ్చినది. మొగమెట్లున్న నేమి తురగముఖులు పూజ్యులుగారా! అంబా! నీవొక్కసారివచ్చి యతని సంగీతమువింటివేనినన్నిట్లనవు పెక్కేలనేను ద్రికరణములచే నాతనిభర్తగావరించితిని. ఇఁక నామనసుతిరుగదు. ఇదిపూర్వజన్మసంబంధమనిమా తండ్రితోజెప్పి సమాధానపరుపుము అనికచ్చితముగా నుత్తరము చెప్పుటయు రాజపత్నియేమియు మాటాడనేరక భర్తయొద్దకుఁబోయి కూఁతు నుద్యమమంతయు నెఱింగించి యిట్లనియె. మనోహరా ! పిల్లదాని గాయకుని కడ శుశ్రూషజేయ నప్పగించుట మనదే తప్పు. అదినాద సముద్రములో మునింగి యతని వరించినది. మనమాటలేమియుఁ జెవికెక్కుటలేదు దానికర్మమ ట్లున్నది మనమేమి చేయఁగలము ! మందలించి చెప్పుటకది చిన్నపిల్లయా! మనమందఱము పశువులమఁట నాదజ్ఞులే యుత్తములఁట దానిమాటలకు నాకు గోపము నవ్వుగూడ వచ్చినది. ఇఁక దాని మనసు తిరుగదు. పోనిండు మునుల బెండ్లియూడినవా రెందఱు సుఖింపలేదు ! సుకస్య గ్రుడ్డి శతవృద్ధునగు. చ్యవనుం బెండ్లియాడి మంచి స్థితికి రాలేదా! అనుమతించి వానికే పెండ్లిచేయుఁడని యేమేమో బోధించి యంగీకరింపఁ జేసినది.