పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద వివాహము.

57

గోరికొనుమని దాసీముఖముగా దమయంతియొద్దకనిపెను. దమయంతి వానినేమియుఁ బరికింపక వానిందెచ్చినదాసితో నోసీ! నామాటలుగా మాతండ్రితో నిట్లుచెప్పుము.

తండ్రీ ! మనయింటఁజాతుర్మాస్యవ్రతము సేయువారిలో నొకఁడు నారదమహర్షియని తెలిసికొనుము. మహతీయుతుండగు నమ్మునితిలకుని నేనువరించితిని. అతండేనాకుభర్త అతండెట్టివాఁడో మీరువినియే యుందురు. నేను తదీయగానవిద్యాపరవశనైతిని నక్రహీనంబై రసాత్మకంబై క్షారరహితంబై సుఖసంపూర్ణంబై తిమింగిలవర్జితమగు నాదసముద్రములోమునిఁగిపోయితిని. జనకా! నాకు మఱియొక పతియవసరములేదు. నారదునకే వివాహముగావింపుము.

అనియుపదేశించిపంపుటయు నాదాది యాపై దలిచెప్పినమాటలన్ని యు సృంజయున కెఱింగించినది. రాజు మిక్కిలి పరితపించుచు భార్యనురప్పించి దమయంతియుద్యమమెఱింగించి యిట్లనియె. అక్కటా నీకూఁతున కిట్టివిపరీతబుద్ధిపుట్టిన దేమి? ఎంతయో తెలివిగలదనుకొంటినే, ఔను స్త్రీబుద్ధి ప్రళయాంతక మనుమాట తథ్యమగును. వనితయు లతయు దగ్గరనున్న వారి నాశ్రయింతురనుమాటయేలతప్పును? అభిక్షుకుండు వానరముఖుండఁట! నేనప్పుడు తిన్నగాఁ జూడలేదు. మహర్షులు గదాయని శుశ్రూషకు నియమించితి ఛీ, ఛీ. ఆఁడుదానిగుణము కడు నింద్యమైనది. తానురాజపుత్రికయై భిక్షుకునెట్లువరించినదో తెలియదు. అందులకే గాయకులకడ నాఁడువారినుంపరాదని చెప్పుదురు. తెలియక మోసపోయితిని నీవుపోయిదానిమందలించుము కులముచెడగొట్టవలదని చెప్పుమని యెన్ని యోబోధించి భార్యం గూఁతునొద్దకనిపెను.

రాజపత్ని పుత్రియొద్దకుఁబోయి భర్త మాటలన్నియు జెప్పి ముక్కుపై వ్రేలిడికొని అయ్యో! యిదియెక్కడికోరిక. ఆకోతిమొగమువాఁడేమి? నీవేమి? వానివరించితినని పలుకుటకు నోరెట్లాడినది?