పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద వివాహము.

53

జపతి సంతసించుచుదమయంతియను పేరుగలతనకూతుంజీరియిట్లనియె.

తల్లీ ! యిరువురు మునితల్లజులు మనయింటఁ జాతుర్మాస్య వ్రతంబు సేయనున్నారు. వారిశుశ్రూషకు నిన్నప్పగించుచున్నాను. నీవు వారిచిత్తములెఱింగి లజ్జాభిమానంబులం బూనక యుపచారములం జేయవలయు నీవు విద్యావతివి నీకుఁ జెప్పనక్కరలేదు. మునులు ముక్కోపులుసుమీ! యౌవన విలాసములం బ్రకటింపక భయభక్తివినయవిశ్వాసములతో నారాధింపుము నీకు శుభంబులం గూర్పఁగలరని బోధించి వారికడకుఁ బంపెను.

దమయంతియు యతులకన్న మున్నలేచి శాటీపటంబు లుతికి యారవైచుచు స్నానమునకుష్ణోదక మమరింపుచు వేదులనలికిమ్రుగ్గులు పెట్టుచుఁబూజాద్రవ్యంబులఁజేర్చుచు హోమోపకరణంబులగు దర్భల సమిత్తుల నాయత్త పరచుచు నుచితకాలమున స్వయముగావండి భోజనంబిడుచు నతిభక్తితో నిష్కాపట్యంబున వారినిద్దరసమముగా నారాధింపుచుండెను. వారు మనసులోఁ గావలసిన వస్తువు దలఁచికొనినతోడనే తెలిసికొని యెదురఁబెట్టుచుండును. వారు జపము జేసి కొనుచుండ వింజామర విసరుచుండును.

వారు వేదవ్రతపరాయుణులై వేదాధ్యయనంబు గావింపుచుఁ జాతుర్మాస్యవ్రతంబు నియమంబున జరుపుచుండిరి. అందు నారదుం డొకనాఁడు స్వరములఁ గల్పించి తనవీణపై గాయత్రమను సామంబు కర్ణరసాయనంబుగాఁ బాడఁదొడంగెను. నారదుని వీణాగానము వినిన మృగములుగూడ మేతమేయవు! ఇతరులమాట జెప్పనేల! దమయంతికి సంగీతమనినఁ జాల ప్రీతికలదు. స్వయముగాబాడును. నారదుని సంగీతమును వినినతోడనే యాశ్చర్యపడి హృదయము నీరుగాఁగ నాప్రాంతమునకు వచ్చి యాలించుచు దన్మయత్వమునొంది రాగలుబ్ధయై యనురాగ సముద్రములో మునిఁగిపోయినది. అమ్మహర్షి కొంతసేపు పాడి