పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కాశీమజిలీకథలు - పదియవభాగము.

    మ్మా! మధుసూదనున్ హరిరమాధవు నర్చనసేయుచుంటినిం
    దీమెయిఁ బల్కరింపఁదగ దిప్పుడు తీరదునాకు రా ననున్.

ఇట్లు నారదుఁడు బాలక్రీడలయందె విష్ణునారాధించుచుఁ దల్లికిని బ్రాహ్మణునకును నానందము గలుగఁజేయుచుండెను. గోపికయు నోపికతో నాపాఱు నారాధింపుచు నారదుం బెనుచుచు సంతోషముతోఁ గడుపుచుండెను.

అట్లు కొన్నిదివసంబు లరుగునంత నొకనాఁడా బాడబునింటికి నల్వురు మహర్షు లతిధులుగా వచ్చి యతనిచే నర్చితులై తద్భక్తి కి మెచ్చుకొని వారింటఁ జాతుర్మాస్యవ్రతంబు గావించుట కొడంబడిరి. ఆగృహస్థుండత్యంతభక్తితో యధాకాలమునకు ఫలమూలాదు లర్పించుచు సేవసేయుచుండెను.

మఱియు నారదుండును నామునిసత్తములు హరిభక్తులని తెలిసికొని సంతతము వారిదాపునఁ గూర్చుండిజపముఁ జేసికొనుచుండఁదాళవృంతమున వీచుచుఁ దిరిగివచ్చిన పాదములొత్తుచు హరికీర్తనలఁబాడుచుఁ దద్భుక్త శేషముల నేవగించుకొనక కన్నులకద్దికొని భక్షించుచుఁ దల్లితోఁగూడ నామహర్షులకోపినగతి నుపచారములు సేయుచుండెను.

గడియయైనఁ దమ్ము విడువక పరిచర్య సేయుచున్న యాబాలునిభక్తికి మెచ్చుకొని వారిలో నొకఁడొకనాఁడు వానిఁజీరి యోరీ! నీవూరక నిత్యము మమ్మారాధించుచుంటివి. నీయభీష్టమేమని యడిగిన వాఁడుచేతులు జోడించి స్వామీ! నా కేకోరికయులేదు జన్మ తారకంబై న విష్ణుమంత్ర ముపదేశింపుఁడనికోరి కొనియెను. ఆమాట విని యాతపస్విమంచివేళ వానిదాపునకురమ్మని చెవిలో శ్రీకృష్ణ మంత్రముపదేశించెను.

నారదుండామంత్రము సర్వదా జపించుచు వారికి శుశ్రూష చేయుచుండెను. ఒకనాఁడాబాలకునితల్లి గోపిక రాత్రివేళ వీధిలో నడుచుచుండఁ ద్రాచుపాముగఱచి హాపుత్రా! అని యఱచుచు నేలం బడినది. అవ్వార్త విని నారదుండార్త నాదముతోఁబోయి తల్లిం గౌఁగ