పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గూడినచో చండాలుండగుచున్నాఁడు. దేవపితృకార్యముల నట్టివానిం జీరరాదు. వాఁడు సాలగ్రామము ముట్టికొనఁదగఁడు వృషలీసంపర్కంబు గలిగిన విప్రుండు పిత్రులతోఁగూడఁ గుంభీపాకనరకంబునఁ బీడింపఁబడు. వాఁ డిచ్చిన తర్పణంబులు పిండంబులు మూత్రపురీష తుల్యంబులగుచుండును. శూద్రధరపానంబును గావించిన పాఱుఁడు రౌరవంబునొందు. కావున నీ భోగంబు నే నొల్ల. నీవిలాసంబు నాకడఁ జూపకుము. మఱియొకని నాశ్రయింపుమని పలికిన విని యక్కలికి యులికిపడి సిగ్గు పెంపున నే మాటయుఁ బలుకనేరక ముహూర్తకాల మూరకుండి వెండియు నిట్లనియె.

మహాత్మా ! మత్సంపర్కంబు కల్మషప్రదమని యొల్లకున్న నే నేమిసేయుదాన నాసపడివచ్చిన మచ్చెకంటింగూడిన దోసంబు లేదని లోకప్రవాదముగలదు. మీకిష్టములేకున్న పోనిండు. మత్పూర్వపుణ్యమెట్లున్నదియో యట్లు కాగలదు. శ్రీకృష్ణమంత్రంబు జపించుచు మీకడ వసించెద నాశుశ్రూష కంగీకరింతురే అని యడిగిన నతం డామాట వినిపించుకొనక తటాకంబున కరిగెను.

కలావతియు నమౌనమే యంగీకారసూచకమని తలంచి యయ్యాశ్రమమున కల్లంతదవ్వులోఁ జలాకరము దాపున వసించి కందమూలాదులం దినుచుం గృష్ణమంత్రంబు జపించుచు నమ్మహర్షి దయ కెదురు సూచుచుండెను. కాశ్యపుడు కొన్ని దినము లామెవంక చూడకయే స్నానముచేసి పోవుచుండును. కొన్ని దినము లటు చూచుచు మాటాడక పోవుచుండును. మఱికొన్నిదినము లామె గుణవంతురాలని తెలిసికొని స్నానమున కరుగునప్పుడు గోపీ ! నీ వేమీ తినుచుంటివి. కందమూలాదులవలన నాఁకలి దీరుచున్నదా ? అని పల్కరించి పోవుచుండును.

మఱియొకనాఁ డతండు కొలనికిం బోవుచు వానం దడిసిన