పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతికథ.

39

మ. త్రిజగన్మోహన రూపసంపదల నుద్దీపించు నయ్యింతి యం
     బుజ నాభాంఘ్రిసరోజయుగ్మ భజనాప్తుండై మనోనాధుఁడా
     త్మజ కేళీవిముఖాత్ముఁ డయ్యెననుచుం దర్కించిసద్భక్తితో
     భజియించున్ సువిరక్తి రాగరహితుం బ్రాణేశునెల్లప్పుడున్ .

అవ్విధం బొరులకుఁ దెలియనీయక కలావతి సంతతము పతిసేవా పరాయత్తచిత్తయై వర్తించుచు నొకన్నాఁ డేకాంతముగాఁ గాంతు నంతికమున వసించి చిఱునగవుమొగంబునకు నగయై మెఱయఁ గరకమలంబులు ముకుళించి యిట్లనియె. ప్రాణేశ్వరా! హరిపాదసేవా నిరతులైన మీచరణసేవ నా కనేకజననకృత సుకృతపరిపాకంబున లభించినది. అందులకు నిత్యము డెందంబున సంతసించుచుందు. మఱియు లోకవాసనాలబ్ధంబగు నభిలాషచే మిమ్మొక్కటి కోరుచుంటి. వినుండు. పుత్రోత్పత్తికై నాయందు వీర్యాధానంబు గావింపవలయు. కామాభిలాష నిట్లడిగితినని తలంపవలదు. మీపాదంబుల తోడు నాకయ్యభిలాషలేదు అని లజ్జావనతవదనయై యడిగిన నతండు సిగ్గును విషాదంబును మనంబుస బెనఁగొన దలవాల్చి యిట్లనియె.

గీ. ఏ నపుంసకుండ నెఱుఁగవో నీవయో
   వాంఛలేదు నాకు వనితలందు
   నిన్నుఁ జూచిచూచి నే నెదఁజింతింతు
   మగతనంబులేమి మగువ! యెపుడు.

గీ. ఒడలునిండంగఁ దొడుగ నీతొడవులెల్ల
   కడుపునిండంగఁగుడువ నీ కుడుపులెల్ల
   కలుగనీ భాగ్యమది యెంతగాని సతికి
   గలుగదించుక రతికేళిఁ గలుగు ప్రీతి.

అని శాస్త్రప్రవాద మున్నది. విలాసవతీ! భవదభినవరూప యౌవన శృంగార విలాసంబులం దిలకించియు ససమర్థుండనగుట, బరిత