పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లుండు కళావతియను భార్యతోఁ గావురముసేయుచుండెను. ద్రుమీళుఁడు హరిభక్తుఁడు. సంతతము శ్రీహరినామసంస్మరణము గావించుచుండును. కలావతియుఁ గలావతీశిఖామణియనఁ ద్రిలోకమోహ జనకంబగు సౌందర్యంబునం బ్రకాశించునది.

సీ. శారదపూర్ణిమా చంద్రబింబము డంబు
             దెగడు చక్కని ముద్దుమొగముతోడ
    దేహలావణ్యప్రవాహప్లవోరుకుం
             భము లనఁదగునురోజములతోడ
    మేలిమిబంగారు మిసిమిరంగుబెడంగు
             జడిపించు నునుమేనిచాయతోడ
    మునులకై నను మోహమొదవించు బలుచూపు
            లను జిమ్ము తెలిసోగకనులతోడ

గీ. కలదు లేదను భ్రమగొల్పు కౌనుతోడ
   రత్నభూషణరుచిర గాత్రములతోడ
   దనరు నయ్యింతి బలు చక్కఁదనము కళకు
   సాటివత్తురె తెరగంటి చానలైన.

నవరత్నప్రభాధగర్ధగితములగు భూషణంబుల ధరించి యమ్మించుబోడి వేడుకలతో భర్తసమీపమునఁ జిట్టకంబుల వెలయింప నతండు వాని నేమియు గణింపక హరిధ్యానలాలసుండై యొప్పుచుండును. అతని విరక్తి గ్రహించి గోపిక యోపికతోఁ బతిసేవచేయుచుండును. మఱియును.

చ. కనుఁగవమూసి యాతఁడధికంబగు. భక్తిరమేశునామ చిం
    తనమొనరించుచుండఁ బ్రమదామణి దాపునఁ దాళవృంతమున్,
    గొని తగవీచుఁ బాదములకుం బ్రణమిల్లు నతండు లేచి న
    ర్తనమొనరింపఁ దాను ననురక్తి రమాధవుఁబాడు నింపుగాన్ .