పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సామర్థ్యాను సారముగా జీవనోపాధిగలుగఁ జేసిరి. కాని చైతన్యము గలుగలేదు. ఆత్మాధిష్టాతలేక పోవుటచేత బోధత్వము గలిగినదికాదు. అప్పుడు పరమేష్ఠి మాలావతితోఁ దల్లీ! నీవు శ్రీవిష్ణుంగీర్తింపుము. ఆయనశకి, బ్రవేసించినంగాని నీభర్తకుఁ జైతన్యముగలుగదు. మాకాసామర్థ్యము లేదు. మామాశక్తుల నిచ్చితిమని పలికిన విని యక్కలికి యలరుచులేచి స్నానముజేసి శుచియై యంజలిపట్టి యిట్లు స్తుతించినది.

గీ. ఎవఁడు లేకదేహులెల్లను శవములై
    పోదురట్టి పరమపురుషుసర్వ
    హేతుమూల హేతు నీశ్వరుసభవు న
    నంతునాత్మఁ బ్రస్తుతింతునెపుడు.

గీ. ఎల్లరునుసేయు కర్మలకెల్లసాక్షి
    యగుచు నిర్లిప్తుఁడై వానియందు నెప్పు
    డెల్లకడ నిండియుండియు నితరులకు నొ
    కింతయునుగానఁ బడని పరేశుఁగొలుతు.

అని వినుతించుచు నా వట్టూత్తముని పాదంబులంబడి మహాత్మా! నీవే సర్వాధిష్టాతవు. రక్షింపుమని ప్రార్ధించినది.అప్పుడు విష్ణుండు సర్వశక్తులతోఁగూడ నధిష్టానముగా నాయుపబర్హణుని దేహములోఁ బ్రవేశించెను. నిద్రితుండు మేల్కొనినట్లుపబర్హణుం డట్టెలేచి చెంగటనున్న మాలావతిజూచి ప్రేయసీ! నేను బండుకొని చాలసేపైనది కాఁబోలు లేపితివికావేమి? అని యడిగిన నాచేదియ యతని యడుగుల నంటి ప్రాణేశ్వరా! మీకుఁ జెప్పవలసినది చాల గలదు. స్నానముజేసి రండని ప్రార్ధించినది.

అతండు లేచి కౌశికీనదిం గృతావగాహుండై ధౌతవస్త్రంబు ధరించి వీణంగైకొని శ్రీహరి నిట్లు గీర్తించెను.