పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలావతికథ.

31

బ్రహ్మచారి — సాధ్వీమణీ ! నీవెవ్వని కూఁతురవు? ఎవ్వని భార్యవు? నీ పేరేమి?

మాలావతి — వటూత్తమా! ఆనందపూర్వకముగా విప్రరూపుఁడగు జనార్దనునకు నమస్కరించు చున్నాను.

బ్రహ్మ - స్వస్తి తేస్తు. సౌభాగ్యవతీభవ.

మాలావతి — మహాత్మా ! నీమాట సత్యమగుఁగాక. విను మేను చిత్రరథుని కూతురను. ఉపబర్హణుని భార్యను నాపేరుమాలావతి యండ్రు.

బ్రహ్మ – నీవీశవంబు నిట్లురంబున వహించియుంటివేల?

మాలావతి — ఈతండు నాపతి అకస్మాత్తుగా మృతినొందెను. సతులకుఁ బతులయందెట్టి యనురాగముండునో విద్వాంసుఁడవగు నీ వెఱుంగకపోవు.

బ్రహ్మ - ఎంతయనురాగమున్నను సతి పతిశవంబు దాల్చి యుండునా?

మాలావతి -- నాభర్తశవముగాదు. ఈతనిం బ్రతికింపవలయు నని వేల్పులంబ్రార్ధించుచుంటి. శుభాశుభ కర్మఫలంబుల దేవతలిచ్చుటకు కర్తలు. కర్మవృక్షచ్ఛేదముసేయుటకుఁ గూడ వారికధికారమున్నది. నాకు వారు పతిభిక్షబెట్టినలెస్సయే. లేకున్న వారిదారుణశాపపాత్రులం గావించెద.

బ్రహ్మ — తల్లీ! దేవతలు కర్మఫలంబిచ్చటకుఁ గర్తలేకాని వానివెంటనే యీయఁగలరా? కాలపక్వము కావలదా? కృషికుండు విత్తనముచల్లినతోడనే ఫలించునా? సుఖదుఃఖములు పూర్వజన్మకర్మ ఫలంబులని నీవేచెప్పితివిగదా. అందులకు దేవతలేమిచేయగలరు? విర్హేతుకముగా దేవతలశపించినఁ బ్రయోజనమేమి?